Begin typing your search above and press return to search.

షాకింగ్ నిర్ణయం తీసుకున్న ముకేశ్ అంబానీ రైట్ హ్యాండ్

By:  Tupaki Desk   |   1 May 2021 3:30 AM GMT
షాకింగ్ నిర్ణయం తీసుకున్న  ముకేశ్ అంబానీ రైట్ హ్యాండ్
X
దేశ కార్పొరేట్ రంగంలో తిరుగులేని అధిక్యతతో పాటు.. యావత్ దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పలుకుబడి ఉన్న పారిశ్రామికవేత్తల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఒకరు. అలాంటి ముకేశ్ కు రైట్ హ్యాండ్ గా ఉండటం సామాన్యమైన విషయమా? తనకున్న హోదా.. పలుకుబడి.. సంపదను వదిలేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వార్త చాలామందికి మింగుడుపడనిదిగా మారింది. ఇంతకీ ఆయనేం చేశారు? ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారన్న విషయంలోకి వెళితే..

ముకేశ్ అంబానీకి రైట్ హ్యాండ్ గా అభివర్ణిస్తారు 64 ఏళ్ల ప్రకాశ్ షా. రిలయన్స్ సంస్థలకు వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించే ఆయన వార్షిక జీతమే రూ.70 కోట్లకు పైన. ముకేశ్ అంబానీకి బాల్యమిత్రుడే కాదు.. మంచి స్నేహితుడు. ముకేశ్ మైండ్ కు అవసరమైన కీలక చిప్ గా ప్రకాశ్ ను పలువురు అభివర్ణిస్తారు. అలాంటి ఆయన ఏప్రిల్ 25న జైన మత సంప్రదాయం ప్రకారం సన్యాస దీక్షను తీసుకోవటం విశేషం.

జైన మత సంప్రదాయం ప్రకారం గచ్చిధిపతి పండిత్ మహారాజ్ సమక్షంలో మహావీరుడి జన్మకల్యాణ దినాన సన్యాస దీక్షను తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రకాశ్ షా కాదు.. ఆయన నూతన్ మునిరాజుగా మారిపోయారు. ఆయన సతీమణి నయనా బెన్ సైతం సన్యాసం తీసుకోవటం గమనార్హం. అయితే.. దీనికి సంబంధించిన ఎలాంటి వార్త బయటకు రాలేదు. తాజాగా.. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ విషయం బయటకు వచ్చింది.

ఇప్పుడు ఆయన ప్రకాశ్ షా కాదని.. ఆయనకు కోట్లాది రూపాయిలు జీతం కిందకు రావని చెబుతున్నారు. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ పీజీ చేసిన ఆయన.. రిలయన్స్ సంస్థకు సంబంధించి పలు కీలక అంశాల్లో కీలక భూమిక పోషించారు. ఓవైపు కరోనా భయంతో ముకేశ్ అంబానీ ముంబయిని విడిపెట్టి.. గుజరాత్ కు వెళ్లిపోతే.. అందుకు భిన్నంగా ఆయన రైట్ హ్యాండ్ మాత్రం సన్యాసం తీసుకొని సింపుల్ లైఫ్ లోకి అడుగు పెట్టటం పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారిందని చెప్పక తప్పదు.