కొత్త సీన్.. బీజేపీ ఎంపీలపై దాడులా ?

Mon Jul 13 2020 10:15:38 GMT+0530 (IST)

Mp Arvindh Fires On Trs Leaders

ఇటీవల కాలంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలపై బీజేపీ నేతల విమర్శలు.. ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటివేళ.. ఊహించని పరిణామం వరంగల్ లో చోటు చేసుకుంది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో ప్రతిపక్ష నేతలపై అధికార పక్ష కార్యకర్తలు దాడికి పాల్పడటం ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. ఈ దాడికి ముందు వరంగల్ నగరంలోని ఇద్దరు ఎమ్మెల్యేపై అరవింద్ ఘాటైన ఆరోపణలు చేయటం గమనార్హం.వరంగల్ పట్టణానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భూకబ్జాదారులంటూ ఆరపణలు చేసిన అరవింద్ తిరిగి వెళ్లే సమయంలో అక్కడకు చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ఎంపీ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడికి పాల్పడటం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వరంగల్ నగరంలో ఉన్న ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భూకబ్జాదారులన్న ఎంపీ అరవింద్.. కేంద్రం వివిధ పథకాల కింద వరంగల్ కు కేటాయించిన రూ.200 కోట్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. వరంగల్ తూర్పు..పశ్చిమ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్.. నన్నపునేని నరేందర్ ల భూఆక్రమణలపై తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు.

ఇదిలా ఉంటే.. బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణల్ని ఖండించేందుకు ఈ ఇరువురు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడతారన్న సమాచారం అందుకున్న బీజేపీ నేతలు.. కార్యకర్తలు అటువైపు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరును బీజేపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. టీఆర్ఎస్ నేతల్ని విమర్శిస్తే చాలు.. దాడులు చేయటం.. కేసులు పెట్టటం సర్వసాధారణమైందని మండిపడుతున్నారు. పోలీసుల తీరును తప్పు పడుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితులు చోటు చేసుకునే వీలుందని చెప్పక తప్పదు.