దిశపై ఘాతుకం.. మరింత విస్మయకరం

Sat Dec 14 2019 11:55:36 GMT+0530 (IST)

షాద్ నగర్ వద్ద దిశపై జరిగిన ఘాతుకానికి సంబంధించి మరిన్ని విస్మయకరమైన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటికే దిశ హంతకులను పోలీసులు ఎన్ కౌంటర్లో హతం చేసిన సంగతి తెలిసిందే. అయితే వారి రాక్షసత్వానికి మరిన్ని ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. వారు చచ్చాకా కూడా.. వారి రాక్షసత్వం ఒళ్లు గగుర్పొడిచే స్థాయిలో బయటపడుతూ ఉంది.దిశపై అత్యాచార చేసిన సమయంలో వారు ఆమెను చిత్రవధకు గురి చేశారని ఫోరెన్సిక్ రిపోర్టు చెబుతూ ఉంది. ఆమెకు వారు మద్యం తాగించినట్టుగా ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. దిశపై అత్యాచారం చేసేందుకు వారు ప్రీ ప్లాన్ వేసుకున్నారు. పగలంతా తాగుతూ అక్కడక్కడే తిరుగుతూ.. ఆమె ఎప్పుడొస్తుందా అని వారు వేచి చూశారు. ఆమెను వ్యూహాత్మకంగా అక్కడ బంధీని చేసి ఘాతుకానికి పాల్పడ్డారు.

ఏదో మద్యం మత్తులో క్షణికావేశంలో చేసిన పని కాదు అది. అత్యంత వ్యూహాత్మకంగా కిరాతకంగా చేసిన ఘాతుకం అది అని ఇప్పటికే స్పష్టం అయ్యింది. తాము దొరకం అనే ఆధారాలన్నింటినీ కాల్చిబూడిద చేయగలమనే లెక్కలతోనే ఆ దుర్మార్గులు ఆ పని చేశారు. పరమ రాక్షసంగా వ్యవహరించారు.

దిశకు వారు మద్యం తాపించారు. ఆమెపై ఘాతుకానికి పాల్పడినప్పుడు బలవంతంగా ఆమెకు వారు మద్యం తాగించారని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేస్తోంది. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టుగా వారు గుర్తించారు. తాము ఆమెకు మద్యంతాగించినట్టుగా వారు పోలీసుల విచారణలో కూడా ఒప్పకున్నట్టుగా తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదికతో ఆ ఘాతుకానికి ఆధారాలు లభించాయి.