Begin typing your search above and press return to search.

గుజరాత్‌ విషాదం.. 60 మంది ప్రాణాలు కాపాడిన యువకుడు!

By:  Tupaki Desk   |   1 Nov 2022 4:30 PM GMT
గుజరాత్‌ విషాదం.. 60 మంది ప్రాణాలు కాపాడిన యువకుడు!
X
గుజరాత్‌లో మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై వేలాడే వంతెన కూలి 135 మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని.. మరో వంద మంది మృతదేహాలు నది అడుగుభాగంలో ఉన్న బురదలో కూరుకుపోయి ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు.

కాగా.. ఈ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ విడుదలైంది. బ్రిడ్జిపై ఉన్న కొంత మంది వ్యక్తులు సెల్ఫీలు తీసుకుంటుండగా.. మధ్యభాగంలో ఉన్నవారు ఆ వంతెనను అటూఇటూ ఊపేందుకు ప్రయత్నించడంతో అప్పటికే బరువును తట్టుకోలేకపోయిన బ్రిడ్జి కుప్పకూలిపోయిన దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.

125 మందిని మాత్రమే మోయగలిగే సామర్థ్యం ఉన్న ఆ వంతెనపైకి 500 మంది చేరడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఆకతాయి యువకులు దాన్ని ఊపడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ప్రమాదం ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

కాగా ఈ ఘటనలో నయీం షేక్‌ అనే ముస్లిం యువకుడు తన స్నేహితుల సహాయంతో దాదాపు 60 మంది ప్రాణాలు కాపాడాడు. వారిని రక్షించే క్రమంలో అతడు గాయపడ్డాడు. ప్రస్తుతం మోర్బీలోని సివిల్‌ ఆసుపత్రిలో నయీం షేక్‌ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో నయీం స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు.

వంతెన కూలిపోయే సమీపంలో తన స్నేహితులు ఐదుగురితో నయీం షేక్‌ అక్కడే ఉన్నాడు. అయితే అతడికి ఈత రావడంతో తన స్నేహితులతో కలిసి మచ్చూ నదిలో పడిపోయిన 60 మందిని రక్షించాడు. తన స్నేహితులు కూడా ఉండటంతో ఎక్కువ మందిని కాపాడాలని కష్టపడ్డామన్నారు. వంతెన కూలిపోయే సమయంలో 500 మంది వరకు వంతెనపై ఉన్నారని వెల్లడించాడు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో చీకటిగా ఉండటంతో 60 మందిని రక్షించాగలిగామని.. ఎక్కువ మందిని కాపాడలేకపోయామని తెలిపాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.