Begin typing your search above and press return to search.

భారత్ కి మరో షాక్ .. రేటింగ్‌ తగ్గించిన మూడీస్‌

By:  Tupaki Desk   |   2 Jun 2020 5:30 AM GMT
భారత్ కి మరో షాక్ .. రేటింగ్‌ తగ్గించిన మూడీస్‌
X
దేశాన్ని ఇప్పటికే వైరస్ అతలాకుతలం చేస్తుంది. గత రెండునెలలుగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో దేశ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ సమయంలో భారత్ కి ప్రపంచ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మరో షాక్ ఇచ్చింది. భారత్‌కి ఇస్తున్న సార్వభౌమ స్థాయిని తగ్గించింది. ఇన్నాళ్లూ రేటింగ్ BAA2గా ఉండగా... దాన్ని BAA3కి పడేసింది. దీని వల్ల భారత్‌కి ప్రపంచస్థాయిలో తీవ్ర నష్టం వాటిల్లనుంది.

‘BAA 3’.. ఇది కనిష్ఠ పెట్టుబడి గ్రేడ్‌ను ప్రతిబింబిస్తుంది. ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన విదేశీ కరెన్సీ, స్థానిక కరెన్సీలకు దీర్ఘకాలానికి BAA 2 రేటింగ్‌ అమలులో ఉంది. వృద్ధిలో క్షీణత, దిగజారుతున్న ఆర్థిక స్థితి నేపథ్యంలో రిస్క్‌లను నివారించడానికి చేపట్టిన విధానాల అమలులో గల సవాళ్లను పరిగణనలోకి తీసుకుని స్థానిక కరెన్సీ సీనియర్‌ అన్‌ సెక్యూర్డ్‌ రేటింగ్‌ తగ్గించినట్టు మూడీస్‌ తెలిపింది. తాజా నిర్ణయంతో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఇండియా అంత అనుకూలమైన దేశం కాదనే భావన వ్యక్తం అవుతుంది. దీంతోపాటు స్వల్పకాలిక స్థానిక కరెన్సీ రేటింగ్‌ను కూడా పి-2 నుంచి పి-3కి కుదించింది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి పై నెగిటివ్‌ వైఖరిని యథాతథంగా కొనసాగిస్తున్నట్టు తెలిపింది

భారత్ రేటింగ్ తగ్గించడానికి ప్రధానంగా 4 కారణాల్ని మూడీస్ లెక్కలోకి తీసుకుంది. 1. 2017 నుంచి ఆర్థిక సంస్కరణల అమలు అంతంత మాత్రంగా ఉంది. 2. ఆర్థిక వృద్ధిరేటు మందగించింది. 3. కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. 4. దేశ ఆర్థిక రంగంపై ఒత్తిడి పెరుగుతోంది. మూడీస్ రేటింగ్ పడేసిందనగానే అంతా వైరస్ వల్లే అనుకుంటారు. కానీ, మూడీస్ వైరస్ ను లెక్కలోకి తీసుకోలేదు. ఆర్థిక పరమైన అంశాల్ని మాత్రమే లెక్కలోకి తీసుకొని రేటింగ్ తగ్గించింది. అయితే, రేటింగ్ నెగెటివ్ అవుట్‌లుక్ ఉండటం వల్ల దేశం మరింత నెగెటివ్‌ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. 2019-20లో భారత వృద్ధి రేటు 4.2 ఉంది. ఈ దశాబ్దంలోనే అది అతి తక్కువ. 2020–21 ఆర్థిక సంవత్సరం లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 4 శాతం క్షీణిస్తుందని మూడీస్‌ తెలిపింది.