Begin typing your search above and press return to search.

మోడీ తదుపరి లక్ష్యం ..యూనిఫామ్ సివిల్ కోడ్ ..సాధ్యమేనా ?

By:  Tupaki Desk   |   13 Nov 2019 2:53 PM GMT
మోడీ తదుపరి లక్ష్యం ..యూనిఫామ్ సివిల్ కోడ్ ..సాధ్యమేనా ?
X
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీని ..ఏ ముహూర్తాన ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారో కానీ , ఇక అప్పటినుండి దేశంలో బీజేపీ హావ కొనసాగుతూనే ఉంది. అలాగే మోడీ క్రేజ్ కూడా అంతకంతకు పెరుగుతూ వస్తుంది. వరుసగా రెండోసారి కూడా లోక్ సభ లో స్పష్టమైన మెజారిటీ తో అధికారం చేపట్టిన బీజేపీ .. మొదటి రోజు నుండే సంచలనమైన నిర్ణయాలతో పాలన సాగిస్తుంది. రెండోసారి అధికారంలోకి చేపట్టిన 70 రోజుల్లోనే కాశ్మీర్ లో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసి , దశాబ్దాలుగా కొనసాగిన కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి చరిత్రలో కలసి పోయేలా చేసింది. ఇక తాజాగా నవంబర్ 9 న అయోధ్య పై సుప్రీం తుది తీర్పుని వెల్లడించింది. దేశంలోనే అత్యంత క్లిష్టమైన సమస్యగా భావించే ఈ అయోధ్య కేసులో కూడా బీజేపీ తన మార్క్ చూపించి ..ఎటువంటి అల్లర్లు జరగకుండా చాలా సున్నితంగా ఈ సమస్య కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ప్రస్తుత అక్కడ రామ మందిర నిర్మాణానికి పనులు చకచకా జరుగుతున్నాయి.

దీనితో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఇచ్చిన మూడు ప్రధాన హామీల్లో రెండు నెరవేరాయి. ఇక మిగిలింది యూనిఫాం సివిల్ కోడ్. మోడీ తదుపరి లక్ష్యం ఇదే. భారతదేశం భిన్నమతాలకు, సంస్కృతులకు నిలయం. అలాంటి చోట ఒక్కో మతానికి ఒక్కో చట్టం అమలు చేయడం సాధ్యమయ్యే అంశం కాదు. భార్య ఒక మతం భర్త ఒక మతం పిల్లలు మరో మతంలో ఉంటున్న రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఆంటే అంత సులభం కాదు. కానీ , బీజేపీ నేతలు తలచుకుంటే ..తాను పట్టిన కుందేలుకి రెండే కాళ్ళు అని నిరూపించగలరు.

అసలు యూనిఫాం సివిల్ కోడ్ కొత్తదేమీ కాదు. ఇప్పటికే ఇది ఎన్నో దేశాల్లో అమల్లో ఉంది. మరో వైపున భారతదేశం మాత్రం దశాబ్దాలుగా చట్టాలను ముక్కచెక్కలుగా చేస్తూ ఒక్కో మతానికి ఒక్కో చట్టాన్ని అన్వయిస్తూ వచ్చింది. అంతా భారతీయులే అయితే ఇన్ని విభిన్న చట్టాలు మనకు అవసరమా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లాంటి చట్టాలు అందరికీ వర్తిస్తున్నప్పుడు మతాల వారీగా పర్సనల్ లాస్ ఎందుకు అని ప్రశ్నించే వారు ఉన్నారు. అదే సమయంలో మతపరమైన స్వేచ్ఛ అంశం తెరపైకి వస్తోంది. చట్టానికి అందరూ సమానమే లాంటి మాటలు తరచూ వింటుంటాం. నిజం మాత్రం అలా ఉండదు.

ఇకపోతే పద్దెనిమిదో శతాబ్దంలో సతీసహగమనం లాంటి సామాజిక దురాచారాలు భారతదేశాన్ని పట్టిపీడించాయి. వాటిని నిషేధిస్తూ చేసిన చట్టాలకు మొదట్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తరువాత పరిస్థితి సద్దుమణిగింది. ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశంలోనూ నేటికీ ఎన్నో మతాచారాలు, సంప్రదాయాలు ప్రజలకు సమాన హక్కులను నిరాకరిస్తున్నాయి. వారి హక్కులను కాలరాస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ తెరపైకి వచ్చింది.

దేశంలో విడాకులకు సంబంధించి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకు వేర్వురు చట్టాలు ఉన్నాయి. హిందూ వివాహ చట్టం ప్రకారం, హిందూ జంటలు వివాహం చేసుకున్న 12 నెలల తర్వాత పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేయవచ్చు. కానీ , క్రైస్తవ జంటలు వివాహం చేసుకున్న 2 సంవత్సరాల తరువాత విడాకుల కోసం దాఖలు చేయవచ్చు, అంతకు ముందు వీలు కాదు. ముస్లిం వివాహచట్టంలో గతంలో ట్రిపుల్ తలాక్ ఉండేది. ఇప్పుడు దాన్ని రద్దు చేసారు. విడాకుల తరువాత, ఒక ముస్లిం పురుషుడు వెంటనే వివాహం చేసుకోవచ్చు, కాని స్త్రీ 4 నెలలు 10 రోజులు వేచి ఉండాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవులకు భిన్నమైన వ్యక్తిగత చట్టం ఉంది. దీన్ని మార్చి అందరికీ ఒకే రకమైన సివిల్ కోడ్ ఉండాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది.

మతం అనగానే గుర్తుకొచ్చేది మహిళలపై వివక్ష. కారణాలు ఏవైనా దాదాపుగా ప్రతి మతంలోనూ మహిళలు సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరిట అణచివేతకు గురవుతున్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాల్సిందే. లింగ వివక్షను రూపుమాపేందుకు ఇక మిగిలిన ఏకైక మార్గం యూనిఫామ్ సివిల్ కోడ్. దీంతో అన్ని మతాల్లోనూ మహిళలకు జరిగే అన్యాయాలను అరికట్టవచ్చనే వారూ ఉన్నారు. నిజానికి యూనిఫామ్ సివిల్ కోడ్ కు, మతాలకు మధ్య సంబంధం లేదు. మనిషి సామాజిక జీవితంలో మతానికి ప్రాధాన్యం పెరగడంతోనే యూనిఫామ్ సివిల్ కోడ్ పై అపోహలు పెరిగాయి. మతతత్వ రాజకీయాల కోసమే యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం ప్రయత్నిస్తున్నారనడం సరికాదు.

రాజ్యాంగంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రస్తావన ఉంది. ఆ దిశలో ప్రభుత్వం కృషి చేయాలని ఆదేశిక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు హిందూ కోడ్ విషయంలోనూ తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అప్పుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి బిల్లును నాలుగైదు భాగాలుగా చేసి వ్యతిరేకత తగ్గేలా చేసి, ఆయా అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేయవచ్చు. అంతగా వివాదం లేని అంశాలను మొదటి దశలో చట్టంగా చేయవచ్చు. చర్చల తరువాత అవసరమైతే అతి కొన్ని మినహాయింపులతో మిగితా అంశాలపై కూడా దశలవారీగా చట్టాలు చేయవచ్చు. ఏదేమైనా ఒకసారి బీజేపీ ప్రభుత్వం అనుకుంటే ..అది అమల్లోకి రావాల్సిందే .. అలాగే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా త్వరలోనే అమల్లోకి వస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రావడానికి కొంచెం లేట్ అవుతుందేమో కానీ , అమల్లోకి రావడం మాత్రం పక్కా ..