Begin typing your search above and press return to search.

రాజకీయాల్లో మోడీకి నచ్చని పదం అదే... ?

By:  Tupaki Desk   |   27 Nov 2021 1:30 PM GMT
రాజకీయాల్లో మోడీకి నచ్చని పదం అదే... ?
X
మోడీ అంటే ఈ రోజుకీ దేశంలోని జనాలకు ఒక కచ్చితమైన అభిప్రాయం ఉంది. ఆయన అవినీతి చేయడు, ఎందుకంటే ఆయనకు కుటుంబం లేదు, ఆయన ఏదైనా చేస్తే జనాలకు మేలు చేయాలనే తపన తప్ప వేరోకటి ఉండదు అని నమ్మే వారే ఎక్కువ. మోడీ ఏడేళ్లుగా ప్రధానిగా ఉన్నారు.

కానీ ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయన సొంతం. రాజకీయంగా, పాలనాపరంగా ఆయన తప్పులు చేసి ఉండవచ్చు, కానీ ఇతర నేతల మాదిరిగా కూడబెట్టుకుని దాచుకోవడానికి ఆయన ఎపుడూ చేయరని మెజారిటీ జనాలు నమ్ముతారు. మోడీ విషయంలో జనాలకు ఉన్న ఈ సాఫ్ట్ కార్నరే ఈ రోజుకీ బీజేపీకి శ్రీరామ రక్షంగా పనిచేస్తోంది.

ఇక మోడీ రాజ్యాంగ దినోత్సవం వేళ కొన్ని సంచలన కామెంట్స్ చేస్శారు. ఆయన అన్న మాటాల్లో నిజాలు ఉన్నాయని కూడా ఎవరైనా అంగీకరిస్తారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ఉన్న గౌరవం, విలువలు, వాటి స్పూర్తిని ఆయన వివరిస్తూనే ఏడున్నర పదులుగా దేశంలో సాగుతున్న రాజకీయ అనారోగ్యకర పరిస్థితులను జనాల కళ్ళ ముందుంచారు.

అవే కుటుంబ పాలన, వారసత్వ రాజకీయం. మోడీకి నచ్చని పదం ఏదైనా ఉంది అంటే వారసత్వం. దాని మీద ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద దేశంలో వారసత్వ రాజకీయాలు అవసరమా అన్నట్లుగా మాట్లాడారు.

తండ్రి తరువాత కొడుకు, వారి బిడ్డలు ఇలా ఒకే కుటుంబం ఇంత పెద్ద దేశాన్ని శాసించడం ఏంటి, ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా అన్నది మోడీ వాదనగా ఉంది. అంతే కాదు, కుటుంబాలకు కుటుంబాలు రాజకీయాలను పదవులను, అధికారాలను తమ ఇళ్లల్లో పెట్టేసుకుని జనాలను మభ్యపెడుతున్న తీరును ఆయన తప్పుపడుతున్నారు. మోడీ బాణాలు సూటిగా కాంగ్రెస్ కి తగిలినట్లుగా అనిపించినా నిజానికి దేశంలో పుట్ట గొడుగుల్లా వచ్చి పడుతున్న కుటుంబ పార్టీలకు బాగానే తగిలాయని అంటున్నారు.

ఉత్తరాది నుంచి మొదలుపెడితే దక్షిణాది వరకూ ఎక్కడ చూసినా కుటుంబ పార్టీల పాలనే చాలా రాష్ట్రాలలో జరుగుతోంది. ఎక్కడో బీహార్ లో నితీష్ కుమార్ లాంటి వారు తమ వారసులను రాజకీయం వైపు రానివ్వని కొన్ని ఉదంతాలు తప్ప అందరూ ఆ తానులో ముక్కలే. మాయావతి, మమతా బెనర్జీలకు పెళ్ళి కాకపోయినా మేనళ్ళుళ్ళు, అన్న దమ్ముల బిడ్డలు వారి వారసులుగా తెర మీదకు వస్తున్నారు.

ఇక యూపీలో ములాయం సింగ్ తరువాత అఖిలేష్ యాదవ్ సీఎం అయ్యారు. కాశ్మీర్ దాకా వెళ్తే అక్కడ షేక్ అబ్దుల్లా నుంచి మొదలుపెడితే ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దులా ఇలా వాళ్ళే దశాబ్దాల పాటు పాలించార్. మరో వైపు ముఫ్తీ మమ్మహద్ సీఎం అయితే ఆయన తరువాత కుమార్తె మెహబూబా ముఫ్తీ పీఠమెక్కారు.

దక్షిణాదిన చూసుకుంటే తమిళనాడులో కరుణానిధి తరువాత స్టాలిన్, కర్నాటకలో దెవెగౌడ తరువాత కుమారస్వామి సీఎం అయ్యారు. ఇక ఏపీలో చూసుకుంటే ఎన్టీయార్ తరువాత చంద్రబాబు, ఇపుడు ఆయన కుమారుడు లోకేష్ ఇలా టీడీపీ ఫక్తు కుటుంబ పార్టీగా రాజకీయం చేస్తోంది. వైసీపీ ని జగన్ సొంతంగా ఏర్పాటు చేసినా ఆయన రాజకీయ నేపధ్యం పూర్తిగా తండ్రి వైఎస్సార్ నుంచే వచ్చింది. తెలంగాణాలో కేసీయర్, కేటీయార్ ఇలా టీయారెస్ లో వారి కుటుంబ పెత్తనం ఉందని విమర్శలు ఉన్నాయి.

మరి ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోడీ ఈ హాట్ కామెంట్స్ చేశారని చెబుతారు. ఈ దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రి వంటి పదవులు దక్కాలీ అంటే పూర్వ జన్మ సుకృతం ఉండాలి. కోట్లలో ఒకరికి ఆ పదవులు లభిస్తాయి. వాటికి కొన్ని రాజకీయ కుటుంబాలకే పరిమితం చేస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధమేముంటుంది.

అసలైన ప్రభువులు ప్రజలు అని అనుకోవడం తప్ప నిజానికి ఒరిగేది ఏముంటుంది. ఈ పాయింట్ నే ప్రధాని మోడీ చక్కగా చెప్పారు. దేశంలోని తప్పులను ఎత్తి చూపారు. అయినా ఈ దేశంలో ఈ వారసత్వ చీడ, కుటుంబ రాజకీయ నీడ పోతుందని ఎవరైనా అనుకుంటే అత్యాశేనేమో. కానీ పోవాలని అంతా పొరాటం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అని గట్టిగా చెప్పవచ్చు.