Begin typing your search above and press return to search.

ప్రధానిగా కాదు.. దేశానికి సేల్స్ మెన్ గా మోడీ వ్యవహరిస్తున్నారు.. కేసీఆర్ సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   2 July 2022 10:30 AM GMT
ప్రధానిగా కాదు.. దేశానికి సేల్స్ మెన్ గా మోడీ వ్యవహరిస్తున్నారు.. కేసీఆర్ సంచలన ఆరోపణలు
X
మోడీ పాలనలో అన్నీ స్కామ్ లే.. దోస్తులకే తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనల మోడీకి లేదు. ప్రధానిగా కాదు.. దేశానికి సేల్స్ మెన్ గా మోడీ వ్యవహరిస్తున్నారని సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ వేసే ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా మోడీ సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్ లో నిర్వహించిన సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టార్చిలైట్ వేసి వెతికినా మోడీ హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని కేసీఆర్ ఆరోపించారు. మోడీ పాలనలో దేశం సర్వనాశనం అవుతోందని కేసీఆర్ విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అప్పుల పాలు చేశారని.. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.

మోడీని చూసి ఫోర్డ్ లాంటి ఎన్నో విదేశీ కంపెనీలు వెళ్లిపోయాయని.. బ్యాంకుల్లో ఎన్పీఏలు భారీగా పెరిగిపోయాయని.. ఇదేనా తమ గొప్పతనం అని కేసీఆర్ ప్రశ్నించారు. ఏ ప్రధాని హయాంలో లేనంతగా రూపాయి విలువ పడిపోయిందని.. ఎంత నల్లధనం తెచ్చారని నిలదీశారు.

మోడీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజారిపోయిందని.. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు? అని కేసీఆర్ ప్రశ్నించారు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే దోషిగానే చూడాల్సి వస్తోందన్నారు. మేము మౌనంగా ఉండమని.. పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రధానిగా మోడీ కాదు.. దోస్త్ షావుకారు కోసం సేల్స్ మెన్ గా పనిచేస్తున్నారు. వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారన్నారు. మోడీ పాలనలో అంతా తిరోగమనమేనన్నారు. మోడీ ఎంత నల్లధనం వెనక్కి తెచ్చారో చెప్పాలన్నారు.

మోడీ వచ్చాక దేశంలో నల్లధనం నియంత్రణ కాదని.. రెట్టింపు అయ్యిందన్నారు. ఇదేనా వికాసం అని ప్రశ్నించారు. నల్లధనం తీసుకొచ్చి రూ.15 లక్షలు పేదల ఖాతాల్లో వేస్తామన్నారని.. ఏ ఒక్కరి ఖాతాల్లోనైనా రూ.15 లక్షలు పడ్డాయా? అని ప్రశ్నించారు.

ప్రధాని మోడీతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవని కేసీఆర్ స్పష్టం చేశారు. విధానాల పరంగానే పోరాడుతామని చెప్పారు. మోడీ పనుల కారణంగా దేశం తలదించుకోవాల్సి వస్తోందని విమర్శించారు.