Begin typing your search above and press return to search.

మరో మిత్రుడికి మంట పుట్టేలా చేసిన మోడీ పరివార్

By:  Tupaki Desk   |   17 Jan 2022 4:25 AM GMT
మరో మిత్రుడికి మంట పుట్టేలా చేసిన మోడీ పరివార్
X
ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో మిత్రుల అవసరం ఎంతైనా ఉంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు తిరుగులేని అధికారం చేతిలో ఉన్నా.. అది ఏదో రోజు చేజారిపోవటం ఖాయం. దాన్ని వీలైనంత ఎక్కువ కాలం తమతో ఉండేలా చేయటం కోసం పక్కా వ్యూహం అవసరం. ఈ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురయ్యేలా చేస్తోంది. గతంలో.. బీజేపీతో కలిసి నడిచేందుకు ఏ రాజకీయ పార్టీ ఇష్టపడేది కాదు. ఆ మాటకు వస్తే.. కేవలం ఒకే ఒక్క ఓటు లేని కారణంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి రావటం తెలిసిందే. ఆ రోజు వాజ్ పేయ్ నాయకత్వంలోని కేంద్ర సర్కారు ఒక్క ఎంపీ ఓటు లేని కారణంగా కుప్పకూలిపోవటం తెలిసిందే.

గతం చేసిన గాయాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ఆ మాటకు వస్తే.. 2014 ఎన్నికల్లో మిత్రుల సహకారంతో ఎన్నికలబరిలోకి దిగిన బీజేపీకి.. వారి అవసరం లేకుండానే సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న ధీమా చాలా తక్కువ కాలానికే వచ్చేసింది. అందుకు తగ్గట్లే 2019 ఎన్నికల ఫలితాలు వెలవడ్డాయి. ఆ తర్వాత నుంచి మోడీ కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ తన తీరును పూర్తిగా మార్చుకుంది.

గతంలో బీజేపీతో జత కట్టటానికిఏ రాజకీయ పార్టీ ముందుకు రాని పరిస్థితి నుంచి.. మరే పార్టీ కూడా తమతో ఉంచుకోవటానికి ఇష్టం లేనట్లుగా మోడీ పరివార్ తయారైందన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అధికారం తమ చేతిలోనే ఉండాలి.. మిత్రుడితో పంచుకోవటానికి ససేమిరా అన్నట్లుగా మోడీ అండ్ కో మైండ్ సెట్ మారిందని చెప్పాలి. ఈ కారణంతోనే.. మహారాష్ట్రలో సుదీర్ఘకాల మిత్రుడు శివసేనతో అధికారాన్ని పంచుకోవటానికి ససేమిరా అని.. చివరకు మిత్రుడ్ని దూరం చేసుకోవటంతోపాటు..అధికారాన్ని వదులుకోవటం తెలిసిందే.

అలా ఒకరి తర్వాత ఒకరిగా మిత్రుల్ని దూరం చేసుకుంటున్న బీజేపీ.. తాజాగా యూపీ ఎన్నికల పుణ్యమా అని మరో మిత్రుడి మనసును నొప్పించేలా నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. బిహార్ లో బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న జేడీయూ.. యూపీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించింది. ఇందులో భాగంగా బీజేపీతో జత కట్టేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ.. ఆ పార్టీతో పొత్తు విషయంలో బీజేపీ ఇష్టపడలేదు. దీంతో.. పొత్తు లెక్కలు ఫెయిల్ అయి.. ఎవరికి వారు పోటీచేయాలన్న నిర్ణయానికి వచ్చారు. జేడీయూతో బీజేపీ పొత్తు కోరుకోవటం లేదని జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి కేసీ త్యాగి వ్యాఖ్యానించటం గమనార్హం.

యూపీ ఎన్నికల్లో అప్నాదళ్.. నిశద్ పార్టీలతోనే బీజేపీ పొత్తు పెట్టుకోవాలని అనుకుంటుందని.. బీజేపీ పెద్దల్ని కలిసేందుకు వెళ్లినప్పటికీ.. తమ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపలేదని జేడీయూ నేత చెప్పారు. బిహార్ లో అధికారంలో ఉన్న తమకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ.. యూపీ ఎన్నికల్లో తమతో పొత్తుకు సైతం సిద్ధంగా లేకపోవటం.. ఆ పార్టీ హర్ట్ చేసేలా చేసిందని చెబుతున్నారు. దీని ప్రభావం రానున్న రోజుల్లో కనిపించక మానదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.