పంద్రాగస్టు వేళ మరోసారి సరికొత్త డిజైన్ తో అదరగొట్టిన మోడీ

Mon Aug 15 2022 12:02:08 GMT+0530 (India Standard Time)

Modi once again impressed with a new design

పాలన గురించి పక్కన పెట్టేద్దాం. రాజకీయం గురించి నిత్యం మాట్లాడుకునేదిగా. అందుకే.. పంద్రాగస్టు వేళ.. ఈ రోజు అందుకు సంబంధం లేని అంశాల గురించి మాట్లాడుకుందాం. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు దేశానికి పలువురు ప్రధానమంత్రులు దేశాన్ని పాలించినా.. వారందరి దారి ఒకటి.. ప్రధాని నరేంద్ర మోడీ దారి వేరు.మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. .ఆయన మాదిరి డ్రెస్సింగ్ సెన్సు.. ప్రత్యేక సందర్భాల్లో తాను తయారయ్యే విధానం గురించి దేశ ప్రజల్లో ఉత్సుకత రేగేలా వ్యవహరించే అరుదైన ప్రధానిగా నరేంద్ర మోడీని చెప్పాలి.

పంద్రాగస్టు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఎప్పటికప్పుడు సరికొత్తగా దర్శనమిచ్చే ఆయన.. తాజాగా ఆయన సిద్ధమైన తీరు ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.

ఇప్పటివరకు ఆయన ధరించే తలపాగాల్లో ది బెస్టు గా చెప్పాలి. త్రివర్ణ పతాకాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్న ఆయన తలపాగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక.. ఆయనధరించిన దుస్తుల్ని చూస్తే.. నీలిరంగు జాకెట్ తో పాటు.. మరింత లైట్ బ్లూకలర్ తో ఉన్న ఫుల్ హ్యాండ్ షర్టును ధరించిన వైనం..గడ్డాన్ని ట్రిమ్ చేసిన తీరు చూస్తే.. ఇట్టే ఆకట్టుకునేలా సిద్ధమయ్యారని చెప్పాలి.

రోటీన్ కు భిన్నంగా ఆయన ఛాతీకి దగ్గరగా తగిలించుకున్న ప్లేట్ ఆకర్షణీయంగా మారింది. పంద్రాగస్టు వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ధరించిన దుస్తులు కూల్ గా ఉండటమే కాదు.. ఆకర్షణీయంగా ఉండటమే కాదు.. చూసినంతనే ఆహ్లాదం కలిగించే డిజైన్ చేయటం గమనార్హం.

మొత్తంగా డ్రెస్సింగ్ స్టైల్ లో నరేంద్ర మోడీని ఢీ కొట్టే నాయకుడే దేశంలోనే మరెవరూ లేరన్నట్లుగా ఉన్నారని చెప్పాలి. 71 ఏళ్ల వయసులో ఒక దేశ ప్రధాని అప్ టు డేట్ అన్నట్లుగా ఫ్యాషన్ ఐకానిక్ గా ఉండటం చాలా అరుదైన అంశంగా చెప్పాలి.