తమిళం నేర్చుకోనందుకు మోడీవారికి బాధగా ఉందట

Sun Feb 28 2021 17:00:50 GMT+0530 (IST)

Modi is upset that he did not learn Tamil

ఏడేళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే మోడీ భలే చిత్రంగా వ్యవహరించేవారు. ఆదివారం వస్తే చాలు.. ఆయన కశ్మీర్ లో ప్రోగ్రాం పెట్టుకునే వారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరే ప్రధాని కూడా అన్నిసార్లు కశ్మీర్ పర్యటించింది లేదు. అలాంటిది మోడీ మాత్రం తరచూ వెళ్లేవారు. అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొనే వారు. కొద్ది కాలానికే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు రావటం.. ఫలితాలు వచ్చేశాయి. ఆ తర్వాత ఆయన తన అలవాటును మార్చుకున్నారు. కశ్మీర్ వెళ్లటం మానేశారు. ఆ మాటకు వస్తే.. కశ్మీర్ మాత్రమే కాదు.. ఏ రాష్ట్రంలో అయితే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయో.. నోటిఫికేషన్ కు నాలుగైదు నెలల ముందు నుంచి ఆ రాష్ట్ర పర్యటనలు చేపట్టేవారు. ఆ తర్వాత కానీ మోడీ పర్యటనల మర్మం అర్థం కాలేదు.ఒక రాష్ట్రంలోఅసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంటే.. అందరి కంటే ముందుగా మేల్కొనేది మోడీనే. మిగిలిన పార్టీల తీరుకు భిన్నంగా వ్యవహరించటం.. అక్కడ పాగా వేసేందుకు అవసరమైన కసరత్తు చేసేవారు.ఇప్పటికి ఆయనకు ఈ అలవాటు మానలేదనే చెప్పాలి. మన్ కీ బాత్ పేరుతో తన మనసులోని భావాల్ని పంచుకునే ఈ వేదిక మీద తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 74వ మన్ కీ బాత్ లో ఆయన పలు అంశాల్నిప్రస్తావించారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషగా పేరున్న తమిళంను నేర్చుకోలేకపోయినందుకు పశ్చాత్తాపాన్నితెలియజేశారు. తమిళ సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు. ఎప్పటిలానే పలు స్ఫూర్తివంతమైన అంశాల్ని ప్రస్తావిస్తూ.. పనిలో పనిగా తమిళం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన వేళ.. తమిళ భాష ప్రస్తావన తీసుకురావటం వ్యూహాత్మకమని చెప్పాలి. తన చేతిలో ఉన్న అస్త్రాల్ని తమిళనాడుకే సరి పెడితే.. బెంగాలీలపై మరింకేం ప్రయోగిస్తారు మోడీజీ? అన్నది ప్రశ్నగా మారింది. తమిళం నేర్చుకోనుందుకు మోడీ అంత ఆవేదన చెందిన వైనాన్ని విన్న తమిళులు ఎలా స్పందిస్తారో చూడాలి.