సుప్రీంకోర్టును లెక్క చేయని మోడీ సర్కార్

Tue Sep 14 2021 13:30:43 GMT+0530 (IST)

Modi government does not count the Supreme Court

నరేంద్ర మోడీ సర్కార్ సుప్రీంకోర్టును ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఈ విషయం తాజాగా జరిగిన విచారణతో స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. సుప్రింకోర్టులో సోమవారం పెగాసస్ స్పైవేర్ తో ప్రముఖుల మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ జరిగింది. మొబైల్ ఫోన్ ట్యాపింగ్ కు కేంద్రం స్పైవేర్ ఉపయోగించిందా లేదా అనే విషయమై స్వయంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఎన్నిసార్లు ప్రశ్నించినా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ డొంక తిరుగుడు సమాధానాలే ఇచ్చారు.స్పైవేర్ ఉపయోగంపై డైరెక్ట్ గా సమాధానం ఇవ్వాలని సీజేఐ ఎన్నిసార్లు ప్రశ్నించినా సొలిసిటర్ జనరల్ మాత్రం సమాధానం ఇవ్వలేదు. దీంతో మండిపోయిన చీఫ్ జస్టిస్ కేంద్రం తీరుపై చాలాసార్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంతసేపు విచారణ జరిగినా దేశ భద్రతకు సంబంధించిన అంశాలను కోర్టులో విచారణ చేయకూడదని సాఫ్ట్ వేర్ వినియోగంపై ఐటీ శాఖ మంత్రి గతంలో పార్లమెంట్ లోనే సమాధానం ఇచ్చారనే విషయాలనే తిప్పి తిప్పి చెప్పారు.

పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై డీటైల్డుగా అఫిడవిట్ వేస్తుందా అన్న ప్రశ్నకు కూడా సొలిసిటర్ జనరల్ ఏమీ సమాధానం చెప్పలేదు. విచారణ జరిగిన తీరు కేంద్రం వాదనలు విన్న తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ ప్రముఖుల మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ కు పెగాసస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించిందనే అనుమానాలు బలపడిపోయాయి. ఇదే సమయంలో దేశభద్రతకు సంబంధించిన అంశాలపై కోర్టుల్లో అసలు విచారణే జరగకుడదన్నట్లుగా పదే పదే సొలిసిటర్ జనరల్ వాదించటం గమనార్హం.

ఇదే పద్ధతిలో ఎంతసేపు విచారణ జరిగినా ఉపయోగం ఉండదని చీఫ్ జస్టిస్ కు అర్ధమై పోయినట్లుంది. స్పైవేర్ వినియోగంపై నిపుణుల కమిటీ వేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని మాత్రం సొలిసిటర్ జనరల్ స్పష్టంగా చెప్పారు. అయితే ఇదే విషయంలో గతంలోనే పార్లమెంటరీ స్టాండింగ్ కౌన్సిల్ సంబంధిత ఉన్నతాధికారులను పిలిపించి జరిపిన విచారణను బీజేపీ ఎంపీలు గబ్బు పట్టించిన విషయం తెలిసిందే. విచారణలో ఉన్నతాధికారులు నోరు విప్పితే ప్రభుత్వ బండారం బయటపడుతుందన్న ఆందోళనతో కమిటీ సభ్యులుగా ఉన్న బీజేపీ ఎంపీలు సమావేశాన్ని జరగకుండా అడ్డుకున్నారు.

మొత్తంమీద అర్ధమవుతున్నదేమంటే పెగాసస్ స్పైవేర్ ను కేంద్రం ఉపయోగించిందనే విషయ అర్ధమైపోయింది. అందుకనే విచారణకు కేంద్రం మాత్రం సహకరించలేదు. అందుకనే కేంద్రం తీరుపై మండిపోయిన చీఫ్ జస్టిస్ తీర్పును రిజర్వ్ చేశారు. తొందరలోనే మధ్యంతర ఉత్తర్వులిస్తామని చెప్పారు. ఏదేమైనా తన నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగటాన్ని మోడీ సర్కార్ ఏ మాత్రం ఇష్టపడటం లేదని తేలిపోయింది.

గతంలో మూడు వ్యవసాయ చట్టాలపైన కోవిడ్ టీకాల ధరలు టీకాల పంపిణీ లాంటి అంశాలపైన కోర్టులో విచారణ జరగటాన్ని కేంద్రం అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. పరిపాలనా విషయాల్లో జోక్యం కూడదని డైరెక్టుగానే సుప్రింకోర్టుకు కేంద్రం అభ్యంతరం చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి పెగాసస్ సాఫ్ట్ వేర్ విషయంలో సుప్రీంకోర్టు ఏమని తీర్పిస్తుందో చూడాలి.