మోడీ మార్కు: ఫ్రీ అన్న పక్కరోజే.. పేదల టీకా ఖర్చు భరించే ఆఫర్

Wed Jun 09 2021 09:00:30 GMT+0530 (IST)

Modi announces free COVID 19 vaccines for all

ఏమైనా సరే.. ప్రధాని మోడీ మిగిలిన వారికి చాలా భిన్నం. ప్రధాని కుర్చీలో కూర్చున్న వారెవరూ ఇప్పటివరకు ఆలోచించని తీరులో ఆలోచించే వైనం అనూహ్యంగా ఉంటుంది. మైలేజీ తన ఖాతాలో వేసుకుంటూ.. దాని భారాన్ని ప్రజల మీద రుద్దుతూ.. దానికి త్యాగమన్న టైటిల్ ఇచ్చేయటం ఆయనకు మాత్రమే సాధ్యం. దేశంలోని ప్రజలందరికి టీకా ఫ్రీ.. రాష్ట్రాలకు అవసరమైన టీకాల్ని మేమే ఇస్తామంటూ గంభీరమైన ప్రకటన వెలువడిన తర్వాత.. మోడీ మాష్టారు ఇంతలా ప్రకటన చేయటమా? ఇందులో మరేం కండీషన్లు లేవా? అని క్రాస్ చెక్ చేసినోళ్లు చాలామందే ఉన్నారు. అయితే అలాంటిదేమీ కనిపించకపోవటంతో కూసింత నిరాశకు గురైనోళ్లు లేకపోలేదు.అయితే.. ఉచిత ప్రకటన చేసిన పక్కరోజునే మోడీ సర్కారు తనదైన శైలిలో స్పందించింది. ఎప్పటిలానే..వ్యాక్సిన్ విషయంలోనూ త్యాగధనుల సాయాన్ని కోరింది. డబ్బులున్న సంపన్నులు.. డబ్బులు అట్టే లేకున్న మనసున్న మారాజుల కోసం టీకాను పేదలకు సాయంగా అందించే ఆఫర్ ను తెర మీదకు తీసుకొచ్చారు. కాస్త డబ్బులున్న వారు టీకాను పేదలకు తమ వంతు సాయంగా ఇప్పించాలని ఎవరైనా డిసైడ్ అయితే.. అలాంటి వారిని నిరాశకు గురి చేయకుండా ఉండేలా ఆఫర్ ను తెర మీదకుతీసుకొచ్చారు.

డబ్బులున్న వారు ఎలక్ట్రానిక్ వోచర్ ను కొనుగోలు చేసి ఎవరికైనా ఇవ్వొచ్చు. ఆ వోచర్ ను పట్టుకొని ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి చూపిస్తే.. వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తారు. అయితే.. కొవిన్ యాప్ లో ముందుగా బుక్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో అక్కడికక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులోకి తేవటం తెలిసిందే. మొత్తానికి పేదలకు సాయం చేయాలనుకునే విశాల హృదయం ఉన్న వారి కోసం మోడీ సర్కారు తెచ్చిన ఈ ఎలక్ట్రానిక్ వోచర్ టీకా సౌకర్యాన్ని ఎంతమంది వినియోగించుకుంటారో చూడాలి.