మూడో వేవ్ వేళ.. పార్లమెంటు భేటీ అవసరమా మోడీజీ?

Sun Jan 16 2022 14:07:38 GMT+0530 (India Standard Time)

Modi Parliament Sessions

దేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. కాస్త ఒంట్లో నలతగా ఉన్నాసర్లేనని సరిపెట్టుకునేవాళ్లు.. పండుగ తర్వాత చూపించుకుందామని ఆగినోళ్లు.. మరీ తప్పదంటే తప్పించి.. పరీక్షలకు వాయిదా వేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందన్న మాట వినిపిస్తున్న వేళలోనే.. కేసుల సంఖ్య పైపైకి వెళ్లటమే కానీ తగ్గని పరిస్థితి. శనివార విడుదలైన రిపోర్టు ప్రకారం దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదైన కేసులు దగ్గర దగ్గర 2.86 లక్షలు. నిజానికి కేసుల నమోదు విషయంలో రెండు వారాల క్రితానికి.. ఇప్పటికి ఏ మాత్రం పోలిక లేని పరిస్థితి.చాలా వేగంగా కేసులు నమోదవుతున్న వేళ.. సంక్రాంతి పండుగ తర్వాత మరింత వేగంగా కేసులు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు.. తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనా? అన్నది ప్రశ్న. నిజమే.. సంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ.. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాల్ని నిర్వహించటం ద్వారా నష్టమే తప్పించి లాభం లేదన్న మాట వినిపిస్తోంది.

పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యుల సరాసరి వయసు 60కు పైనే ఉంటుంది. ఇలాంటప్పుడు.. పెద్ద వయస్కుల వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడేలా సభను నిర్వహించాలా? అన్నది ప్రశ్న. దీనికి తోడు.. పార్లమెంటుసమావేశాలు అంటే.. భారీ భద్రతా సిబ్బందితో పాటు.. విధులకు హాజరు కావాల్సిన ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఓపక్క కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న వేళలో.. సమావేశాల్ని నిర్వహించటం రిస్కు తప్పించి వేరే మాట లేదంటున్నారు.

ఇప్పటికే పార్లమెంటు సిబ్బందిలో దాదాపు800 మందికి పైనే కరోనా బారిన పడినట్లు చెబుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. పార్లమెంటు సమావేశాల సమయానికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందన్న అంచనా ఉంది. అంతేకాదు.. రానున్న వారంలో దేశీయంగా కరోనా కేసులు రోజువారీగా నాలుగు లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

ఏ విధంగా చూసినా.. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాల్ని సంప్రదాయ బద్ధంగా కాకుండా అందుకు భిన్నంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది? దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు.. ఎంపీలను దేశ రాజధానికి తీసుకొచ్చి.. వారి ఆరోగ్యాలతో ఆటలు ఆడుకునే కన్నా.. పార్లమెంటు సమావేశాల్ని వాయిదా వేయటం కానీ.. ఆన్ లైన్ లో నిర్వహించే అంశాన్ని పరిశీలించాలన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.మరి.. మోడీ మాష్టారి మదిలో  ఏమున్నదో?