కరోనా ఎఫెక్ట్ : ఏప్రిల్ లో ఎమర్జెన్సీ ప్రకటించబోతున్న మోడీ సర్కార్ ..?

Tue Mar 31 2020 15:54:06 GMT+0530 (IST)

Modi Government Sensational Decision

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అనేక తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.   తాజాగా కరోనా నేపథ్యంలో దేశంలో ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ ని విధిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా ఇతర మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే ఎమర్జెన్సీ నేపథ్యంలో మాజీ భారత సైనికులు ఎన్ సీసీ ఎన్ ఎస్ సీ క్యాడెట్లు పౌర పరిపాలకులుగా కొనసాగుతారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలో ఎంత మాత్రం కూడా వాస్తవం లేదని భారత సైన్యం స్పష్టం చేసింది.ఏడీజీ పీఐ-ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ వేదికగా ఈ ఎమర్జెన్సీ పై వస్తున్న తప్పుడు కథనాలపై స్పందించింది. ఎమర్జెన్సీ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇదంతా దురుద్దేశ విద్వేషపూరితంగా ఉందని తెలిపింది. ఎమర్జెన్సీ అంటూ వచ్చిన అన్ని వార్తల్లోనూ ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. దేశంలో కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సందేశాలు తప్పుడు ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

అంతకుముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై కూడా కేంద్రం స్పందించింది. ప్రభుత్వానికి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇక కరోనా కట్టడి కోసం మూడు వారాలపాటు లాక్ డౌన్ పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే లాక్ డౌన్ పొడగించే విషయం పై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఇప్పటి కైతే లాక్ డౌన్ పొడిగించే అవకాశం లేదు అని తెలిపింది. కాగా దేశ వ్యాప్తంగా 1251 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 32 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది.