వెస్ట్.. మంత్రి వెలంపల్లికి సేఫ్ జోనా ?

Sun Apr 18 2021 21:00:01 GMT+0530 (IST)

Minister Velampalli Srinivas came up with a new idea

ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ను వేరే చోటకు పంపుతారని.. వెస్ట్ నియోజకవర్గంలో మరో నాయకుడికి అవకాశం ఇస్తారని.. వైసీపీలో గుసగుస వినిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెలంపల్లికి వ్యతిరేకత ఎక్కువగా ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు జిల్లాలోని మరో నియోజకవర్గానికి పంపే ఆలోచన ఉందని అంటున్నారు. ఇటీవల విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇక్కడి రాజకీయ పరిస్థితులపై పరిశీలన చేశారు. ఈ క్రమంలోనే మంత్రి వెలంపల్లికి వ్యతిరేకత ఉన్నట్టు తెలిసింది. అయితే.. అంతమాత్రాన నియోజకవర్గం మార్చేయాలా? అనేది ప్రధాన సమస్య.కానీ ఇక్కడ మరో కీలక నేత కుమారుడుకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే..ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి వెలంపల్లి.. సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. పశ్చిమలో వైసీపీకి తిరుగులేదని చెప్పాల్సిన ఆయన.. తనకు తిరుగులేదని ప్రచారం చేసుకుంటున్నారు. వెస్ట్ నియోజకవర్గంలో వెలంపల్లికి తిరుగులేదని.. మరో ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇక్కడ వెలంపల్లి వైశ్య సామాజిక వర్గానికి 35 శాతం ఓటు బ్యాంకుఉందని.. వారంతా కూడా వెలంపల్లికి అనుకూలమని.. ప్రచారం చేస్తున్నారు. మిగిలిన వారిలో 10 శాతం మాత్రమే ముస్లింలు ఉన్నారని.. వారిలోనూ సగం మంది వెలంపల్లికి అనుకూలమేనని అంటున్నారు.

ఇక బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా వెలంపల్లిపై వ్యతిరేకత లేదని అంటున్నారు. ఇక కీలకమైన విజయవాడ నగర్ మేయర్ పదవిని సైతం పశ్చిమ నియోజకవర్గానికే చెందిన రాయన భాగ్యలక్ష్మికి కేటాయించారు. ఈ కేటాయింపు వెనక రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వచ్చే మంత్రి వర్గ ప్రక్షాళనలో వెల్లంపల్లిని తప్పించినా.. ఆయన కినుక వహించకుండా ఆయన సూచించిన వ్యక్తికే మేయర్ పదవి ఇచ్చారన్న టాక్ కూడా ఉంది.

ఇక పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగని మాట వాస్తవమేనని.. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు వస్తే.. అభివృద్ధి జరుగుతుందని.. ఈ విషయంలో వెలంపల్లి తప్పులేదని ప్రచారంలో కీలకంగా కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే.. ఇదేదో వెలంపల్లే సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారా? లేక.. నిజంగానే ఆయనను మార్చాలని అధిష్టానం భావిస్తోందా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. మరి విషయం ఏంటనేది తేలాలంటే వెయిట్ చేయాల్సిందే.