పక్క రాష్ట్రాల సీఎంలు ఈగలు తోలుకుంటున్నారు: మంత్రి పువ్వాడ అజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Wed May 25 2022 09:59:37 GMT+0530 (IST)

Minister Puvada Ajay Controversial Words

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తుంటే.. పక్కరాష్ట్రాల్లో మాత్రం పెట్టుబడులు ఎవరూ పెట్టడం లేదని అన్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో కేటీఆర్ అడుగుపెట్టగానే తెలంగాణలో పెట్టుబడులు పెడతామని కంపెనీలు ఎగబడుతున్నాయని పువ్వాడ తెలిపారు. మరోవైపు పక్క రాష్ట్రాల సీఎంలు పెట్టుబడులు తెచ్చుకోలేక ఈగలు తోలుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలకు ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఖమ్మంలో నిర్మించిన గిరిజన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి పువ్వాడ తన నోటికి పని చెప్పారు.అలాగే తెలంగాణ వస్తే చీకటి ఏర్పడుతుందని చెప్పిన నాయకుల రాష్ట్రాలు కూడా ఇప్పుడు కరెంటు కోతలతో అల్లాడుతున్నాయని పువ్వాడ అజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రం రెండుగా విడిపోతే తెలంగాణలో కరెంటు కోతలు తీవ్రమవుతాయని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపైనే పువ్వాడ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని ఏపీ ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

పక్క రాష్ట్రాలకు పెట్టుబడులు రావడం లేదని.. ఆ రాష్ట్రాల సీఎంలు ఈగలు తోలుకుంటున్నారని పువ్వాడ వ్యాఖ్యలు చేసినా ఆయన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ గురించే కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ను టార్గెట్ చేయడం వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువైందని పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రులు మరోమారు తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక పట్టణాభివృద్ధి ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కూడా పక్క రాష్ట్రంలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉందని.. నరకంలాంటి పరిస్థితి ఉందని తన స్నేహితులు చెప్పారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన మాటల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని.. క్యాజువల్ గా తాను ఆ వ్యాఖ్యలు చేశానని కేటీఆర్ వివరణ ఇచ్చారు.

గతంలోనూ తెలంగాణ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి విదితమే. ఆ కోవలోనే తాజాగా తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. దీనిపైన ఏపీ మంత్రులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

కాగా పువ్వాడ అజయ్.. తన తాజా ప్రసంగంలో బీజేపీ కాంగ్రెస్ నేతలపైనా విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. పీసీసీ పదవి వచ్చినంత మాత్రాన.. సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే పెద్ద నాయకుడిని అనుకుంటే పొరపాటు అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పువ్వాడ విమర్శలు చేశారు.