Begin typing your search above and press return to search.

కుప్పం నుంచి హీరో విశాల్ పోటీపై తేల్చేసిన మంత్రి పెద్దిరెడ్డి!

By:  Tupaki Desk   |   30 Jun 2022 3:30 PM GMT
కుప్పం నుంచి హీరో విశాల్ పోటీపై తేల్చేసిన మంత్రి పెద్దిరెడ్డి!
X
గ‌తేడాది జరిగిన కుప్పం మున్సిపాలిటీలో విజ‌యం సాధించ‌డంతో వైఎస్సార్సీపీ రెట్టించిన ఉత్సాహంతో ఉర‌క‌లేస్తోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కుప్పంలో గ‌ట్టి అభ్య‌ర్థిని నిల‌బెట్టి ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడికి షాక్ ఇవ్వాల‌నే యోచ‌న‌లో ఉంద‌ని స‌మాచారం. 1989 నుంచి 2019 వ‌ర‌కు అంటే ఏడుసార్లు కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ఈసారి షాకివ్వ‌డానికి వైఎస్సార్సీపీ పావులు క‌దుపుతోంద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సోద‌రుడి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని లేదా బ‌ల‌మైన బీసీ అభ్య‌ర్థిని బ‌రిలో దించుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వీరెవ‌రూ కాకుంటే ప్ర‌ముఖ సినీ హీరో విశాల్ ను వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేయిస్తార‌ని చ‌ర్చ జ‌రిగింది. విశాల్ త‌మిళ సినిమాల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. విశాల్ తండ్రి జీకే రెడ్డి ప్ర‌ముఖ బిల్డ‌ర్ గా, రియ‌ల్ట‌ర్ గా, నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. విశాల్ సొంత వూరు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంద‌ని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో విశాల్ ను వైఎస్సార్సీపీ త‌ర‌ఫున కుప్పం బరిలో చంద్ర‌బాబుపైకి ప్ర‌యోగిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వైఎస్ జ‌గ‌న్ తోనూ విశాల్ కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

ఈ గాసిప్స్, వార్త‌ల‌ నేప‌థ్యంలో కుప్పం నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థిపై ఇంధ‌న‌, గ‌నులు, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తాజాగా స్ప‌ష్ట‌తనిచ్చార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కుప్పంలో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న భ‌ర‌త్ పోటీ చేస్తార‌ని పెద్దిరెడ్డి చెబుతున్నారు. గ‌తంలో రెండుసార్లు భ‌ర‌త్ తండ్రి చంద్ర‌మౌళి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసి చంద్ర‌బాబుపై ఓడిపోయారు.

ప్రస్తుతం కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జిగా, ఎమ్మెల్సీగా భ‌ర‌త్ ఉన్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే ఇప్ప‌టివ‌ర‌కు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీ కార్య‌క్ర‌మాల‌న్నీ జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కూడా భ‌ర‌త్ నేతృత్వంలోనే కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న‌ ప్ర‌తి ఇంటికి వెళ్లీ వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే భ‌ర‌త్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుపై పోటీ చేస్తార‌ని మంత్రి పెద్దిరెడ్డి ప్ర‌క‌టించ‌డంతో హీరో విశాల్ గా పోటీ చేస్తార‌నే వార్త‌ల‌కు చెక్ ప‌డ్డ‌ట్టేన‌ని స‌మాచారం.

మ‌రోవైపు చంద్ర‌బాబు కుప్పంలోనే ఇల్లు కట్టుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించాల‌ని వైఎస్సార్సీపీ ల‌క్ష్యంగా పెట్టుకోవ‌డంతో చంద్ర‌బాబు ఇప్ప‌టి నుంచే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌కు దిగార‌ని అంటున్నారు. మ‌రోవైపు వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో కుప్పంను గెల‌వాల‌నే ల‌క్ష్యంతో ఉంది. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జులతో నిర్వ‌హించిన స‌మావేశంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 కు 175 స్థానాలు నెగ్గాల‌ని సూచించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు చిత్తూరు జిల్లాతోపాటు ఎన్నిక‌లు ఎక్క‌డ జ‌రుగుతున్నా త‌మ‌కు ఏకుకు మేకుగా మారిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై చంద్ర‌బాబు కూడా ఫోక‌స్ పెట్టార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం పుంగ‌నూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి కొన‌సాగుతున్నారు. ఈసారి పెద్దిరెడ్డిపై మాజీ మంత్రి అమ‌ర్నాథ్ రెడ్డిని నిల‌పాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ముందు పెద్దిరెడ్డికి షాకు ఇస్తే కానీ చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ దూకుడుకు అడ్డుక‌ట్ట ప‌డ‌ద‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నార‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పెద్దిరెడ్డిపై టీడీపీ త‌ర‌ఫున అనీషారెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే.