Begin typing your search above and press return to search.

డీజీపీ ఎదుట మంత్రి మల్లారెడ్డి అతి చేశారా?

By:  Tupaki Desk   |   2 Jun 2023 2:00 PM GMT
డీజీపీ ఎదుట మంత్రి మల్లారెడ్డి అతి చేశారా?
X
తొందరపడి ఒక మాట అనటం పెద్ద విషయం కాదు. కానీ.. తమ మాటలతో వేలాది మంది మనసుల్ని నొచ్చుకునేలా మాట్లాడటం ఏ మాత్రం మంచిది కాదు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని నేతలు ఈ మధ్యన ఎక్కవ అవుతున్న పరిస్థితి. ఆ కోవలోకే వస్తారు తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖా మంత్రి మల్లారెడ్డి. తాను పాల్గొనే కార్యక్రమాల్లో నాటకీయంగా మాట్లాడటం.. ప్రతి విషయాన్ని కామెడీగా మార్చటం చేస్తూ.. మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. నవ్వుతూ మాట్లాడినట్లే మాట్లాడుతూ.. హద్దులు దాటేలా మాట్లాడటం.. తన మాటలతో పలువురిని గాయపరిచే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతుందన్న విమర్శ వినిపిస్తోంది.

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు మంత్రి మల్లారెడ్డి. తనకు సంబంధం లేని శాఖకు సంబంధించి.. దాని సిబ్బందికి సంబంధించి వ్యాఖ్యలు చేసే వేళలో కాస్తంత మర్యాదను పాటించాల్సిన అవసరం ఉంది. పోలీసుల ఫిట్ నెస్ గురించి హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర డీజీపీ ఎదుట ఆయన మాట్లాడిన మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని మంత్రి మల్లారెడ్డి కోరారు.

మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని మల్కాజ్ గిరి జోన్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో నూతన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ నుప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని.. పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవటానికి పోలీస్ స్టేషన్ లో జిమ్ లు ఏర్పాటు చేయాలన్న సూచన చేశారు.

తాము ఉన్నట్లుగా పోలీసులు మంచి ఫిట్ గా ఉండాలన్న మల్లారెడ్డి.. పోలీసుల్ని చూస్తే దొంగలు గజగజ వణికిపోవాలన్నారు. ఓపక్క పోలీసులకు సంబంధించిన వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి.. మరోవైపు ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ పోలీసులు ఉన్నట్లు చెప్పారు.పోలీసులు బాగా పని చేస్తున్నారని.. కేసుల్ని తొందరగా పరిష్కరిస్తున్నట్లుగా ప్రశంసించారు.

మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. బొజ్జ ఉంటే ప్రమోషన్లు వద్దన్న మాట అర్థం లేనిదిగా చెప్పాలి. ఎంత ఫిట్ గా ఉన్నప్పటికి.. వయసు తీసుకొచ్చే మార్పులు అన్ని ఇన్ని కావు. వీటికి మినహాయింపుగా ఉండే వారు చాలా కొద్దిమందే ఉంటారు. దీనికి తోడు తీవ్రమైన పని ఒత్తిడి.. అధికారుల జులంలో.. డ్యూటీని చేయటానికే పోలీసులకు సమయం సరిపోతుంది తప్పించి.. ఫిట్ గా ఉండేందుకు సమయాన్ని కేటాయించలేని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. నలభైలు దాటిన తర్వాత ఎంత కంట్రోల్ లో ఉన్నా.. పొట్ట రావటం మామూలే. ఎంతలా ప్రయత్నించినా దాని నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. మంత్రి మల్లారెడ్డి మాటల లెక్కలో చూస్తే.. నలభైలు దాటిన పోలీసుల్లో సింహభాగం సిబ్బందికి ప్రమోషన్లు అన్నవే రాని పరిస్థితి ఉంటుంది. పోలీసులు ఫిట్ గా ఉండాలని కోరుకోవటం తప్పేం కాదు. అందుకు ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల్ని ప్రస్తావించాలే కానీ.. సిబ్బంది కడుపు కొట్టేలా.. వారి ప్రమోషన్ల మీద ఈ తరహా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న మాట వినిపిస్తోంది.