సంక్రాంతి ఎఫెక్ట్: మంత్రి కొడాలి ఇన్‌కమ్ 250 కోట్లు!.. టీడీపీ వెల్లడి

Mon Jan 17 2022 23:00:01 GMT+0530 (IST)

Minister Kodali Income 250 crores

సంక్రాంతి అంటేనే తెలుగు లోగిళ్లలో ఘనంగా చేసుకునే పండుగ. ముఖ్యంగా ఏపీలో అయితే.. కోడిపందేలు అంబరాన్నంటుతుంటాయి. ఇక పేకాట గుండాట.. ఇలా అనేక అంశాలతో సంక్రాంతికి శోభ చేకూరుతుంది. కోళ్ల పందేలను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి కూడా తెలుగు వారు వస్తుంటారు. అంతేకాదు.. ఈ కోళ్ల పందేల్లో లక్షల రూపాయల సొమ్ము చేతులు మారుతుందనే విషయం తెలిసిందే.అయితే.. ఈ సారి ఈ సంక్రాంతి కోడి పందేల్లోకి వైసీపీ నాయకుడు ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలినాని ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా ఆయన తన సొంత కన్వెన్షన్(కే-కన్వెన్షన్‌నే వేదిగా చేసుకున్నారు.  అయితే.. ఈ పండుగలో కొడాలి ఏకంగా రూ.250 కోట్ల మేరకు సంపాయించారని.. టీడీపీ ఆరోపించింది.టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే.. పిఠాపురానికి చెందిన వర్మ.. కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. నాని సంక్రాంతి ఆదాయం రూ.250 పైనేఉందని వర్మ పేర్కొన్నారు. “వైసిపి మంత్రి ఫంక్షన్ హాల్ కె కన్వెన్షన్ చీర్ గర్ల్స్‌తో రికార్డింగ్ డ్యాన్స్‌లు పేకాట మరికొన్ని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించింది. నిర్వాహకులు ప్రవేశానికి రూ. 10000 వసూలు చేశారు. ప్రజలను దోచుకోవడానికి కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో ఏర్పాటు చేశారు. గోవా సంస్కృతిని గుడివాడకు తీసుకువచ్చారు అయినప్పటికీ పోలీసులు కళ్ళు మూసుకున్నారు ”అని  వర్మ అన్నారు.
 
“కృష్ణా జిల్లా గుడివాడలోనే కాదు చాలా మంది వైసీపీ మంత్రులు తమ నియోజకవర్గాల్లో కూడా అదే చేశారు. 'బూతుల' మంత్రి (కొడాలి నానిని ఉద్దేశించి) ఈ మూడు రోజుల్లో దాదాపు రూ.200-రూ.250 కోట్లు రాబట్టింది. అందులో తమకు మంచి శాతం వాటా వస్తున్నందున పోలీసులు మౌనంగా ఉన్నారు'' అని వర్మ ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన వర్మ ఉన్నత స్థాయి విచారణ జరపాలని సూచించారు. పోలీసులు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కొడాలిపై డీజీ స్థాయి విచారణ చేపట్టి దోషిగా తేలితే అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టాలి'' అని టీడీపీ నేత అన్నారు.

టీడీపీ నేత వర్మ తన ఆరోపణలకు బలం చేకూరుస్తూ కే కన్వెన్షన్ సెంటర్ నుండి కొన్ని చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయనే విషయాన్ని స్పష్టం చేశారు. వాటిని మీడియాకు కూడా ప్రదర్శించారు. కాగా గత వారం మంత్రి కొడాలి నాని కోవిడ్-19 బారిన పడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా మీడియా కెమెరాల నుంచి కనిపించకుండా పోయిన ఆయన టీడీపీ నేతల ఆరోపణలపై ఇంతవరకూ స్పందించలేదు.