బలగం సింగర్ కు ఆపదొచ్చింది.. స్పందించిన హరీశ్

Fri Mar 31 2023 09:47:33 GMT+0530 (India Standard Time)

Minister Harish Rao Supports Balagam Singer

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల కావటమే కాదు.. రోటీన్ కు భిన్నంగా రిలీజ్ వేడుకను చేపట్టిన బలగం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏళ్లకు ఏళ్లు జబర్దస్త్ కమెడియన్ గా సుపరిచితుడైన వేణు టాలెంట్ గురించి ఇప్పుడు  అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ మూవీలో హైలెట్ గా నిలిచే క్లైమాక్స్ లో ఆరు నిమిషాలకు పైగా సాగే బుర్రకథ పాటకు.. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. పాట సాగే కొద్దీ.. ఎమోషన్ లోపల నుంచి తన్నుకు వచ్చేలా చేసిన ఆ పాటకు ఫిదా కాని వారే లేరు.అయితే.. ఆ పాటను ఆలపించిన గాయకుడి ఆరోగ్యం దారుణ పరిస్థితుల్లో ఉందన్న చేదు నిజం ఇటీవల బయటకు రాగా.. ఆ విషయంపై తాజాగా రియాక్టు అయ్యారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు. క్లైమాక్స్ లో బుర్రకథ పాటను ఆలపించిన సింగర్ మొగిలయ్యకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. డయాలసిస్ చేసుకుంటూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. షుగర్ ఎక్కువ కావటంతో కళ్లు కనిపించని పరిస్థితి. వైద్యం కోసం ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేయటమేకాదు.. రూ.8లక్షల అప్పు మీద పడి కిందామీదా పడుతున్న పరిస్థితి.

తన గాత్రంతో కోట్లాది మంది మనసుల్ని స్పందించేలా చేసిన గాయకుడు మొగిలయ్య దారుణ అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్నంతనే మంత్రి హరీశ్ రియాక్టు అయ్యారు. ఆయన్ను అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లి.. సరైన వైద్యం చేసి.. తిరిగి అంబులెన్సులో ఇంటికి చేర్చాలంటూ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన హరీశ్ వ్యాఖ్యలపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.