Begin typing your search above and press return to search.

మంత్రి గుడివాడ గారూ.. తెలంగాణ‌పై ఒక్క లుక్కేయండి ప్లీజ్‌!!

By:  Tupaki Desk   |   26 May 2023 11:12 AM GMT
మంత్రి గుడివాడ గారూ.. తెలంగాణ‌పై ఒక్క లుక్కేయండి ప్లీజ్‌!!
X
మంత్రి గుడివాడ గారూ.. తెలంగాణ‌పై ఒక్క లుక్కేయండి.. ప్లీజ్‌!! అంటూ.. నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కార‌ణం తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఆ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బ్రిట‌న్‌, అమెరికా దేశాల‌లో ప‌ర్య‌టించారు. కానీ, ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమ‌ర్నాథ్ మాత్రం.. విశాఖ దాటి కాలు బ‌య‌ట‌కు పెట్ట‌డం లేద‌ని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

కేటీఆర్ రెండు వారాల పాటు ఆయా దేశాల్లో సాగించిన పర్యటనలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేం దుకు పలు సంస్థలను ఒప్పించారు. ఆ సంస్థల పెట్టుబడులతో రాష్ట్రంలో 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రం ఆవిర్భ‌వించాక‌.. ఇంత పెద్ద మొత్తంలో విదేశీ సంస్థ‌లు పెట్టుబడులు పెట్ట‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. మంత్రి కేటీఆర్‌ న్యూయార్క్‌, లండన్‌, హ్యూస్టన్‌, వాషింగ్టన్‌ డీసీ, హేండర్‌ సన్‌, బోస్టన్‌లలో పర్యటించారు.

ఈ సంద‌ర్భంగా 80కి పైగా వ్యాపార సమావేశాలకు హాజరయ్యారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందు కు, వ్యాపార విస్తరణకు మెడ్‌ట్రానిక్‌, వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ, వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌, స్టేట్‌ స్ట్రీట్‌, డాజోన్‌, లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూపు, అలియంట్‌, స్టెమ్‌క్రూజ్‌, టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ, మాండీ, జాప్‌కామ్‌ గ్రూప్‌లు ముందుకొచ్చేలా వారితో చ‌ర్చించారు. ఫలితంగా పలు రంగాల్లో కొత్తగా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.

ఆయా కంపెనీల పెట్టుబ‌డుల‌తో ప్రత్యక్ష ఉద్యోగంతో పాటు 3 లేదా 4 పరోక్ష ఉద్యోగాలూ లభిస్తాయి. పర్య టనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ లండన్‌లో జరిగిన 'ఐడియాస్‌ ఫర్‌ ఇండియా', అమెరికాలోని నెవెడాలో నిర్వహించిన 'ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల కాంగ్రెస్‌' సదస్సుల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 'ఇంజినీరింగ్‌ పురోగతి, భాగస్వామ్యానికి చిహ్నం'గా గౌరవం లభించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

దాదాపు 30 కంపెనీలకు చెందిన ఎన్నారై సీఈవోలతో సమావేశమైన మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. దాంతో నల్గొండలో సొనాటా సాఫ్ట్‌వేర్‌, కరీంనగర్‌లో 3ఎం-ఎక్లాట్‌, వరంగల్‌లో రైట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు తమ కార్యకలాపాల విస్తరణకు అంగీకరించాయి. మ‌రి ఇప్ప‌టికైనా.. మంత్రి గుడివాడ గారు ముందుకు క‌దులుతారా? లేదా? చూడాలి.