Begin typing your search above and press return to search.

మర్కజ్ కల్లోలం..ముందుగా గుర్తించింది తెలంగాణేనట!

By:  Tupaki Desk   |   1 April 2020 3:00 PM GMT
మర్కజ్ కల్లోలం..ముందుగా గుర్తించింది తెలంగాణేనట!
X
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఢిల్లీలో ముస్లింల తబ్లీగీ జమాత్ కేంద్ర కార్యాలయం మర్కజ్ లో ఇటీవల జరిగిన భారీ సమావేశానికి హాజరైన వారిలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులున్న విషయం పెను కలకలమే రేపుతోంది. దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటుగా విదేశాల నుంచి కూడా మర్కజ్ సమావేశానికి హాజరయ్యారని - వారిలో ఇంకా చాలా మంది ట్రేస్ కాలేదన్న విషయం మరింత కలకలం రేపుతోంది. ఈ క్రమంలో అసలు దేశంలోని చాలా కేసులకు మర్కజ్ సమావేశమే కారణమని కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో తెలంగాణ వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. అసలు మర్కజ్ గురించిన సమాచారాన్ని కేంద్రానికి అందించింది తామేనని - మర్కజ్ ప్రమాదాన్ని అందరికంటే ముందుగానే గుర్తించింది తెలంగాణేనని ఆయన బుధవారం ఓ ప్రకటన చేశారు.

ఈ మేరకు బుధవారం ఈటల ఓ కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా.. మర్కజ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మర్కజ్ సమావేశానికి వేలాది మంది హాజరైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన ఈటల... మర్కజ్ సమావేశానికి ఒక్క తెలంగాణ నుంచే 1200 మంది హారజరయ్యారని - వారిలో ఇప్పటికే 160 మంది మినహా మిగిలిన అందరినీ గుర్తించామని ఈటల చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఢిల్లీలోని మర్కజ్ గురించి కేంద్ర ప్రభుత్వానికి ముందుగా తెలిపింది తామేనని కూడా ఈటల చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా లాక్ డౌన్ ప్రకటించింది కూడా తెలంగాణేనని కూడా ఈటల చెప్పుకొచ్చారు.

మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగానే ముందుకు రావాలని ఈటల పిలుపునిచ్చారు. ఇలా తమకు తాముగా ముందుకు వస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కూడా చెప్పిన ఈటల... మర్కజ్ కు వెళ్లివచ్చిన వారు గోప్యతను పాటిస్తే... అది వారిని మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా దహించి వేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే కాకుండా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెనువెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించాలని - అలా చేస్తే వారికి తక్షణమే వైద్య పరీక్షలు చేసి - కరోనా సోకితే ఐసోలేషన్ కు పంపి వారి కుటుంబాలను కాపాడతామని ఈటల పేర్కొన్నారు. మొత్తంగా కరోనాపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం చెస్తున్న కృషికి తోడుగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడంతో మెరుగైన ఫలితాలను సాదించే అవకాశాలున్నాయని ఈటల చెప్పుకొచ్చారు.