వలంటీర్లు మనం పెట్టిన చిన్న బచ్చా గాళ్లు: వైసీపీ మినిస్టర్

Wed Jul 06 2022 10:21:13 GMT+0530 (India Standard Time)

Minister Dahisetty Raja comments On Volunteers

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టాక కార్యకర్తలకు ప్రాధాన్యం తగ్గిపోయిందని వైఎస్సార్సీపీ కార్యకర్తలు నేతలు వాపోతున్నారు. ప్రజలకు సంబంధించిన పనులన్నీ వలంటీర్లు మాత్రమే చేస్తుంటే తమను ఎవరూ పట్టించుకోవడం లేదనేది వారి వాదనగా ఉందని అంటున్నారు. ఈ విషయంపై మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి అంబటి రాంబాబు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు కార్యకర్తలకు ప్రాధాన్యం లభించడం లేదని వ్యాఖ్యలు చేశారు.



ఇప్పుడు ఈ కోవలో రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేరారు. వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్లు తాము పెట్టిన చిన్న బచ్చా గాళ్లు అని.. వాళ్లు తమ మీద పెత్తనం చెలాయిస్తున్నారని మంత్రి రాజా ఫైర్ అయ్యారు.

ఈ విషయంలో చాలా మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని మంత్రి రాజా వ్యాఖ్యానించారు. వలంటీర్లను మనమే పెట్టామని.. మీకు నచ్చకపోతే తీసేయండి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వార్డు సచివాలయాలను కార్యకర్తలు కంట్రోల్లోకి తీసుకుని నడిపించాలి.. మిమ్మల్ని ఎవరూ వద్దని చెప్పరు అని కూడా రాజా హాట్ కామెంట్స్ చేశారు.

గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలు చూశాం.. మన ప్రభుత్వం వచ్చింది మన కష్టాలు తీరతాయని కార్యకర్తలు ఊహించుకున్నారు. కానీ పూర్తిగా నిరాశే ఎదురైంది. ఎందుకంటే మన వెనుకాల.. మనం పెట్టిన వాలంటీర్లు ఉన్నారు. వాళ్లు మనం పెట్టిన చిన్న బచ్చాగాళ్లోంటోళ్లు. ఈ బచ్చాగాళ్లు మన మీద పెత్తనం చేస్తున్నారు.. మనం ఏం చేయలేకపోతున్నామనే భావనలో కార్యకర్తలు ఉన్నారు.

కార్యకర్తలారా.. నాయకులారా.. ఒక్కటైతే చెబుతున్నాను.. ఈ పార్టీకి జగన్ తయారు చేసిన జెండా.. ఆ జెండా పట్టుకొని తిరిగే మీరు శాశ్వతం. మేం శాశ్వతం కాదు.. ఈ పార్టీ మీది అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు.

ఇటీవలే మంత్రి అంబటి రాంబాబు సైతం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వలంటీర్లను తీసేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇలా రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులు వలంటీర్లపై వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.