Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్సీల‌కు మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న స‌వాల్‌

By:  Tupaki Desk   |   18 Jun 2020 12:10 PM GMT
టీడీపీ ఎమ్మెల్సీల‌కు మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న స‌వాల్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాసన మండలి నిరవధికంగా వాయిదా పడిన సంద‌ర్భంగా బుధ‌వారం శాసనమండలిలో జరిగిన ఘటనల‌పై టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయి. ఈ సంద‌ర్భంగా ఒక‌రిపై ఒకరికి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ఈ విష‌యంపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ తీరుపై మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న స‌వాల్ చేశారు.

త‌మ పార్టీ నాయ‌కులు ఎలాంటి తప్పు చేయలేదని, ఒకవేళ తాను తప్పు చేసినట్లుగా నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే టీడీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారా అంటూ గురువారం మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌ సవాల్ విసిరారు. శాసనమండలిలో టీడీపీ చౌకబారు రాజకీయాలు చేసిందని, మండలిలో నిన్న జరిగిన ఘటనలు దారుణమని మండిపడ్డారు. మండలిలో బలం ఉందని ఏమైనా చేస్తామంటే ఊరుకునేది లేద‌న్నారు. సంఖ్యా బలం చూసుకొని టీడీపీ నేతలు ప్రభుత్వ బిల్లులను అడ్డుకునే కుట్ర చేశారని దుయ్య‌బట్టారు.

ఎమ్మెల్సీ నారా లోకేశ్ శాసనమండలిలో పిల్ల చేష్టలు చేశారని, వీడియోలు తీయడం చెయ్యొద్దు అని చెప్తే మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మండలిని టీడీపీ నిరవధిక వాయిదా వేయించి వెళ్లిపోయారని విమర్శించారు. బిల్లుల ఆమోదం విషయంలో టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరించి ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదించకుండా వెళ్లిపోయిందని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మండలిలో తాము టీడీపీ ఎమ్మెల్సీలను కొట్టామని, బూతులు తిట్టామని చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై నిరూపించండి అని స‌వాల్ విసిరారు.

తాను సభలో జిప్ తీసి అసభ్యంగా ప్రవర్తించారని లోకేశ్‌, అశోక్ బాబు, బాబు రాజేంద్రప్రసాద్ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ మండిప‌డ్డారు. మహిళా ఎమ్మెల్సీల ముందు అసభ్యంగా ప్రవర్తించానని టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఈ విష‌య‌మై చైర్మన్ దగ్గరకు వెళ్లి వీడియోలు చూపించాల‌ని కోరుదామని పిలుపునిచ్చారు. నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, నిరూపించ లేకుంటే టీడీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారా అంటూ స‌వాల్ విసిరారు. ద్రవ్య వినిమయ బిల్లును కూడా అడ్డుకుని టీడీపీ చరిత్రలో నిలిచిపోయిందని మండిప‌డ్డారు.