మంత్రి ఆదిమూలపు సురేష్ కు స్వల్ప అస్వస్థత!

Sat Jun 25 2022 16:00:02 GMT+0530 (IST)

Minister Adimulpu Suresh

ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేశ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జూన్ 25న శనివారం ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జార్జి ఇంజనీరింగ్ కళాశాలలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆదిమూలపు సురేష్ నడుస్తూ ఒక్కసారిగా కిందపడిపోయారు. లోబీపీ ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన అనుచరులు కుటుంబసభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వైద్యులు కాలేజీకి చేరుకొని మంత్రి సురేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్లే ఆయన కిందపడినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో కొన్ని గంటల పాటు కాలేజీలోనే మంత్రి సురేశ్ విశ్రాంతి తీసుకున్నారు.కాగా జూన్ మొదటి వారంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు ఆయనకు స్టెంట్ వేశారు.

ఆదిమూలపు సురేశ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. జూన్ మొదటి వారంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మంత్రి సురేశ్.. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది రోజులు తన స్వస్థలంలోనే విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుచరులు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

గత నెల చివర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఆదిమూలపు సురేశ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు సభల్లో మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేకూరిన లబ్ధి గురించి వివరించారు. బస్సు యాత్రలో ఉండగానే ఆయన అప్పుడు అస్వస్థతకు గురయ్యారు.

కాగా ఆదిమూలపు సురేశ్ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉన్నత విద్యావంతుడైన ఆదిమూలపు సురేశ్.. వైఎస్ జగన్ మొదటి మంత్రివర్గ విస్తరణలో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు.

వైఎస్ జగన్ ఇటీవల రెండోసారి విస్తరించిన మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకున్నారు. మరోసారి కీలక మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలను సాధించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో ఆదిమూలపు సురేష్ ఒకరని చెబుతుంటారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కదనుకున్నా ఇదే కారణంతో రెండోసారి కూడా మంత్రిపదవిని ఒడిసిపట్టారని చెప్పుకుంటుంటారు.