Begin typing your search above and press return to search.

వైరల్: వర్క్ ఫ్రం హోంతోనే బిల్ గేట్స్ కొంప కొల్లేరైందా?

By:  Tupaki Desk   |   13 May 2021 3:03 PM IST
వైరల్: వర్క్ ఫ్రం హోంతోనే బిల్ గేట్స్ కొంప కొల్లేరైందా?
X
గడిచిన ఏడాది కాలంలో అన్నీ మారిపోయాయి. మాయదారి కరోనా వైరస్ మన జీవితాల్లోకి ప్రవేశించి ఒళ్లు, ఇళ్లు గుల్ల చేయడమే కాదు.. సంసారాలను చిన్నా భిన్నం చేసిన సంగతి చూస్తున్నాం.. పద్ధతిగా ఉదయం ఆఫీసుకు వెళ్లి.. సాయంత్రం ఇంటికొచ్చి భార్యతో అలా సాయంత్రం షికారుకు వెళ్లి ఆమె ముద్దు ముచ్చట తీరిస్తే ఇక వారం దాకా ఇంట్లో నో గొడవలు. కానీ ఇప్పుడు వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ఇంట్లోనే మొగుళ్లు ఉండడంతో ఇంట్లో చిన్న చిన్న వాటికి కూడా ఆలుమగల మధ్య గొడవలు మొదలైపోతున్నాయి. అటు వర్క్ ఫ్రం హోం.. ఇటు ఇంట్లో చిన్నపాటి గొడవలు భరించలేక దేశంలో గత సంవత్సర కాలంలో గృహ హింస కేసులు పెరిగాయన్నది వాస్తవం.

ఇంట్లో గంటో, లేదంటే రెండు మూడు గంటలో ఉంటే అనోన్యత అనేది వర్ధిల్లుతుంది. కానీ నిత్యం 24 గంటలు ఆలుమగలు ఎదురెదురుగా ఉంటే గొడవలు ఎక్కువ అయిపోతున్నాయని పలు అధ్యయనాల్లో తేలిపోయింది. మొగుళ్లు, పెళ్లాల మధ్య గొడవలతో ఎంతో మంది ఈ ఏడాదిలో విడిపోయారు. గొడవలతో పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కిన వారు ఎందరో ఉన్నారు.

ఇక మొదటి లాక్ డౌన్ లో భర్తలు/భార్యల ఎఫెర్ లు ఎన్నో బయటపడ్డాయి. ఆఫీసుకని వెళ్లి అక్కడ పెట్టుకున్న అక్రమ సంబందాలు.. బయట పెట్టుకున్న సెకండ్ సెటప్ లు అన్నీ కూడా లాక్ డౌన్ వేళ బయటకొచ్చి నానా రచ్చ జరిగిన సంగతి మనం టీవీల్లో, వార్తపత్రికల్లో చూశాం.

అందుకే కరోనా రోగాలను కలుగజేయడమే కాదు.. చాలా మంది జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించింది. సామాజికంగా, ఆర్థికంగా కూడా దెబ్బతీసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ అవుతోంది.

ప్రపంచ ప్రఖ్యాత కుబేరుడు బిల్ గేట్స్ ఇటీవల తన 27 ఏళ్ల సంసార జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి తన భార్య మెలిండాకు విడాకులు ఇవ్వడం సంచలనమైంది. దానికి కారణాలు ఏంటనేది ఇద్దరూ చెప్పలేదు. కానీ అసలు కారణం ఎవరికి తెలియకున్నా తలో విధంగా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఫన్నీ మీమ్స్ వచ్చిపడుతున్నాయి.

బిల్ గేట్స్ గత 27 ఏళ్లుగా రోజు ఆఫీసుకు వెళ్లి వచ్చాడు కాబట్టి అతడి సంసారం సాఫీగా సాగిందని.. కానీ కరోనాతో గత సంవత్సరం నుంచి ఇంట్లోనే వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో భార్యతో గొడవలు మొదలై పడలేక విడాకులకు దారితీసిందని అర్థం వచ్చేలా ఫన్నీ ఫొటోలు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

నిజానికి బిల్ గేట్స్ విడాకులకు ఇది కారణం కాకున్నా నెటిజన్లు మాత్రం తమ క్రియేటివిటీని అంతా జోడించి బిల్ గేట్స్ అంతటి వాడినే వర్క్ ఫ్రం హోం ఇంతటి దారుణానికి దారితీసేలా చేసిందని.. అందరూ కామ్ గా ఉండాలని సెటైర్లు వేస్తున్నారు. ఏంతైనా కరోనా లాక్ డౌన్ తో వచ్చిన ఈ కొత్త పని వాతావరణం ఇంట్లో బందీగా మారిపోయిన భర్తలకు, భార్యలకు మధ్య బంధాన్ని పలుచన చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని నిపుణులు అంటున్నారు.