ఏపీ హోం మంత్రిని టార్గెట్ చేస్తుందెవరు...?

Wed Oct 16 2019 23:00:01 GMT+0530 (IST)

ఏపీ రాజకీయాల్లోనే కాదు.. సామాన్య ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వర్సెస్ పోలీస్‌శాఖగా మారింది పరిస్థితి. కొన్ని రోజులుగా ప్రతిపక్ష నేత - మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ శాఖను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సూటిగా విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీకి తొత్తులుగా మారి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. పోలీసులు వైసీపీ నేతల్లా మారారని - ఆ పార్టీలో చేరిపోండని కూడా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అయితే.. ఎందుకీ పరిస్థితులు ఏర్పడ్డాయన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.హోంశాఖ మంత్రి సుచరిత బాధ్యతల నిర్వహణలో విఫలం చెందడం వల్లే ఈ పరిస్థితులు  ఏర్పడ్డాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ అన్ని సామాజికవర్గాలకు సముచిత స్థానం కల్పించారు. అందులో మహిళలకు మరింత ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగానే సుచరితకు హోంశాఖ మంత్రిగా - డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కట్టబెట్టారు. అయితే.. జగన్ నమ్మకాన్ని నిలబెట్టడంలో మంత్రి సుచరిత కొంత తడబడుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో ఆమె విఫలం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

చంద్రబాబు పోలీస్ శాఖపై చేస్తున్న కామెంట్లతో మంత్రి సుచరితపై విమర్శలు మరింతగా పెరిగిపోతున్నాయి. ప్రతిపక్ష నేతకు ధీటుగా కౌంటర్ ఇవ్వాల్సిన హోంమంత్రి సుచరిత సైలెంట్ గా ఉండడం వల్లే పోలీసు అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చిందని - ఇప్పుడు పోలీసులే ప్రతిపక్షానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వచ్చిపడ్డాయని పలువురు అంటున్నారు. హోంశాఖ మంత్రిగా మేకతోటి సుచరిత బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు దాటి అయిదవ నెలలో ప్రవేశించినా కూడా మంత్రిగా ఆమె తన పనితీరు మెరుగుపరచుకోలేదా ? అన్న సందేహాలు వస్తున్నాయి.

చంద్రబాబు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో విఫలం చెందడం వల్లే పోలీసులు రంగంలోకి దిగుతున్నారని - ఇది వైసీపీ ప్రభుత్వానికి మంచి పరిణామం కాదని పలువురు నాయకులు సూచిస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద రాజకీయ విమర్శలు కాకపోయినా ధీటుగా జవాబు చెప్పేందుకు పోలీస్ ఉన్నతాధికారులు రెడీ అయ్యారంటే ఆ శాఖను చూసే మంత్రి మేకతోటి సుచరిత ఏం ? చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శాంతిభద్రతల విభాగం డీజీ రవిశంకర్ మీడియా ముందుకు వచ్చి ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి సజావుగా ఉందని చెప్పుకున్నారు. రాజకీయ పార్టీగా టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు.