మేకపాటి కుటుంబంలో వైసీపీ చిచ్చు.. బాబాయిపై అబ్బాయి ఫైర్!

Fri Mar 31 2023 17:00:02 GMT+0530 (India Standard Time)

Mekapati Vikram Reddy comments

నెల్లూరు జిల్లాకు చెందిన కీలకమైన రాజకీయ కుటుంబం మేకపాటి ఫ్యామిలీలో వైసీపీ చిచ్చు రేగింది. ని న్న మొన్నటి వరకు.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారంటూ.. ఆయనను తీవ్రంగా విమర్శించడం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రశేఖరరెడ్డి కూడా.. వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు పార్టీకి సంబంధం లేదని.. వచ్చే ఎన్నికల్లో పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని అన్నారు.



అయితే.. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మేకపాటి రాజమోహన్రెడ్డి(చంద్రశేఖరరెడ్డి అన్నయ్య) రెండో కుమారు డు ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తెరమీదికి వచ్చారు. తాము వైసీపీ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. తమకు తమ బాబాయికి సంబంధం లేదని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ పార్టీ తర్వాత.. తమను అక్కున చేర్చుకున్నది.. వైసీపీనేనని.. తమకు ఎంపీ ఎమ్మెల్యే మంత్రి పదవులు ఇచ్చింది కూడా.. వైసీపీనేనని చెప్పారు.

ఈ నేపథ్యంలో వైసీపీని తాము వీడేది లేదని విక్రమ్రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా నెల్లూరు లోని 10 నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంటుందనిధీమా వ్యక్తం చేశారు.

ఇదేసమయం లో తన బాబాయి మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యవహారం తమకు నచ్చలేదన్నారు. పార్టీని ధిక్కరించడం.. పార్టీ గీసిన గీత దాటడం సరికాదన్నారు. రెండు సార్లు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చిందని.. ఈ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోలేక పోయారని చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కానీ మేకపాటి ఇంటి పేరును కానీ.. వదిలేసి వెళ్తే.. అప్పుడు చంద్రశేఖరరెడ్డి అసలు శక్తి ఏంటో తెలుస్తుందని..బాబాయికి విక్రమ్రెడ్డి సవాల్విసిరారు.  

తాము అసంతృప్తితో ఉన్నట్టుగా తాము పార్టీ వీడుతున్నట్టుగా ప్రచారం చేసే వారిని కుక్కలతో పోల్చారు. తమకు ఎ లాంటి అసంతృప్తి లేదన్నారు. తాము వైసీపీలోనే కొనసాగతామని ఆయన స్పష్టం చేశారు.