రాజకీయ జీవితం ఇంతటితో సమాప్తం మేకపాటి సంచలనం

Tue Mar 28 2023 23:18:21 GMT+0530 (India Standard Time)

Mekapati Chandrasekhar Reddy political news

నెల్లూరు జిల్లా రాజకీయాలలో మేకపాటి వారిది అత్యంత కీలకమైన పాత్ర. మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆ తరువాత సోదరుడు చంద్రశేఖరరెడ్డిని రంగంలోకి దింపారు. 2014లో రాజమోహన్ రెడ్డి పెద్ద కుమారుడు గౌతం రెడ్డి రంగంలోకి దిగి రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు.



ఆయన ఆకస్మిక మరణంతో మేకపాటి వారికి నిండా విషాదమే గూడు కట్టుకుంది. ఇక రెండవ కుమారుడు విక్రం రెడ్డి అయ్యారు. ఇక మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా నాలుగవ సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు.

ఏడు పదులు దాటిన మేకపాటి దీన్ని తట్టుకోలేకపోతున్నారు. తాను మొదటి నుంచి ఉన్న పార్టీ వైసీపీ తనను పక్కన పెట్టడంతో ఆయన వేదన చెందుతున్నారు. దాంతో ఆయన వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే ఆయన అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి వచ్చారు. రెండు సార్లు ఆయన హార్ట్ కి సర్జరీ జరిగింది అని చెబుతున్నారు.

వయసు మీరిన ఈ దశలో రాజకీయాలు చేయడం అవసరమా అన్న చర్చ కుటుంబ సభ్యుల నుంచి వస్తోందిట. దాంతో మేకపాటి కఠిన నిర్ణయం తీసుకున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోను అని ఆయన అంటున్నారు. తన వద్ద కోట్ల రూపాయలు డబ్బులు లేవని తాను అప్పులు చేసి ఉన్నానని ఆయన చెబుతున్నారు.

తనకు వర్తమాన రాజకీయాలు అంటే విరక్తి కలుగుతోందని దాంతో రాజకీయాలు చేయడం అవసరమా అని కూడా అనిపిస్తోందని ఆయన అంటున్నారు. అందువల్ల రాజకీయాల నుంచి దూరంగా జరగాలని డెసిషన్ తీసుకున్నానని ఆయన చెప్పారు. తన రాజకీయ జీవితం ఇంతటితో సమాప్తం అని మేకపాటి చెప్పడం ఇపుడు వైరల్ అవుతోంది.

అప్పులు చేసి కోట్లు ఖర్చు చేసి రాజకీయాలు చేయడం తన వల్ల కాదని ఆయన తేల్చేశారు. అందువల్ల స్వస్తి అనేశారు. ఇదిలా ఉంటే తన ఖర్చులు ఎవరినా పెట్టుకుని తనకు అవకాశం ఇస్తే మళ్లీ పోటీ గురించి ఆలోచిస్తాను అని మేకపాటి చెప్పడం విశేషం. అంటే ఆయన తొంబై తొమ్మిది శాతం రాజకీయ విరామానికే అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క శాతం ఏమిటి అన్నదే చూడాలి.

ఇంకో వైపు చూస్తే తెలుగుదేశం కూడా మేకపాటికి టికెట్ ఇచ్చే చాన్స్ లేదని అంటున్నారు. అందుకే పెద్దాయన ఇలా డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు. మేకపాటి అనుచరులు ఉదయగిరిలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి వారి దారి ఏమిటి వారి ఆలోచనలు ఏమిటి అన్నది చూడాలి. ఏది ఏమైనా మేకపాటి బ్రదర్స్ ఇద్దరూ ఇపుడు రాజకీయాలకు నమస్కరం అనేసారు. 2024లో మేకపాటి విక్రం రెడ్డి పోటీ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.