Begin typing your search above and press return to search.

బీజేపీ ఆశలకు చెక్ చెప్పేసిన మెగాస్టార్

By:  Tupaki Desk   |   28 Nov 2022 3:19 PM GMT
బీజేపీ ఆశలకు చెక్ చెప్పేసిన మెగాస్టార్
X
మెగాస్టార్ చిరంజీవ్ టాలెటెండ్ ఆర్టిస్ట్. ఆ విషయంలో ఎవరికీ ఎటువంటి డౌట్లూ అవసరం లేదు. ఆయనకు ఎన్నో అవార్డులు రావాలి. కొన్ని వచ్చాయి. ఇంకా కొన్ని వెయిటింగ్ లో ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా చూస్తే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు మెగాస్టార్ ని వరించింది.

గోవాలో జరిగిన అంతర్జాతీయ ముగింపు ఉత్సవ వేళ ఈ అవార్డుని చిరంజీవి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చక్కని ప్రసంగం చేశారు. అది అంగ్లంతో పాటు మధ్యలో తెలుగులో కూడా సాగింది.

సినిమా రంగం తనను మెగాస్టార్ ని చేసింది అని చెప్పుకున్నారు చిరంజీవి. ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు అంటే అది సినీ కళామతల్లి ఇచ్చిన గౌరవం స్థానం స్థాయి అని ఆయన మనసులో మాటను చెప్పేశారు.

ఇంతటి విలువ గౌరవం తనకు ఏ ఇతర రంగంలోనూ దొరకలేదని ఆయన అన్నారు. నాలుగున్నర దశాబ్దాల తన సినీ జీవిత చరిత్రలో ఒక దశాబ్ద కాలం మాత్రం రాజకీయాల రూపేణ సినీ రంగానికి దూరంగా ఉన్నానని, ఆ తరువాత మరోసారి సినిమాల్లోకి వచ్చినపుడు తనకు ఈ రంగం విలువ ఏంటి అన్నది పూర్తిగా తెలిసింది అని ఆయన నిజాయతీగా చెపుకొచ్చారు.

అందువల్ల తాను సినీ ప్రియులకు తన అభిమానులకు మాట ఇస్తున్నాను అని చెబుతూ తన జీవిత పర్యంతం సినిమాలను వీడిపోనని, సినిమాలే తనకు గమ్యం అని అవే తన శ్వాస అని చెప్పారు. అంటే తనకు మరే ఇతర రంగం మీద ఆసక్తి కానీ అనురక్తి కానీ లేనే లేదని మెగాస్టార్ ఇఫీ వేదికగా పక్కా క్లారిటీతో స్పష్టం చేసినట్లు అయింది.

మెగాస్టార్ ని అవార్డులతో లేక ఇతర మర్యాదలతో ఆకట్టుకోవాలని బీజేపీ చూస్తోంది అన్న ప్రచారం అయితే సాగుతోంది. ఈ మధ్యనే భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలలో చిరంజీవిని స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. ప్రస్తుతం ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వేళ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ చిరంజీవ్ని అభినందిస్తూ బ్రహ్మాండమైన ట్వీట్ చేశారు.

ఇవన్నీ కూడా చూసినపుడు బీజేపీ గేలం వేస్తోంది, వచ్చే ఎన్నికల వేళ మెగాస్టార్ ని రాజకీయంగా ముందుకు తీసుకువస్తారు అని అంతటా ప్రచారం అయితే సాగింది. దానికి పూర్తి స్థాయిలో చెక్ చెబుతూ తనకు సినిమాయే ప్రాణం అని ఈ ఫీల్డ్ ని ఇక జీవితం మొత్తం మీద వదిలిపెట్టే సమస్యే లేదని మెగాస్టార్ తేల్చేశారు.

మొత్తానికి చిరంజీవి అంటే మెగాస్టారే అనిపించారు. ఆయన ఇక ఎన్నటికీ పొలిటికల్ స్టార్ కాడూ కాలేడని కూడా స్పష్టం చేసారు. మొత్తానికి చిరంజీవికి సినిమాల మీద ఉన్న వ్యామోహం ప్రేమ మరోసారి ఇలా ఇఫీ వేదికగా బయటపడింది అని అంతా అంటున్నారు. ఆయన దశాబ్ద రాజకీయం అన్నది ఒక ఫ్లాష్ బ్యాక్ మాత్రమే అని కూడా బీజేపీ వారితో సహా అంతా అర్ధం చేసుకోవాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.