Begin typing your search above and press return to search.

వంద మందితో వస్తానని చెప్పే ముందు..ఎవరిని అడిగి వెళ్లినట్లు చిరు?

By:  Tupaki Desk   |   13 Jan 2022 1:30 PM GMT
వంద మందితో వస్తానని చెప్పే ముందు..ఎవరిని అడిగి వెళ్లినట్లు చిరు?
X
ఇప్పుడున్న రోజులు ఎలాంటివి? కన్న కూతురు కానీ కొడుకు కానీ వాళ్లు తమ వాళ్లే కదా అని ఎవరితోనైనా పెళ్లి ఫిక్స్ చేస్తే.. సర్లే నాన్నారు.. అనేసి పెళ్లి చేసుకోవటానికి సిద్దమవుతారా? అది సాధ్యమవుతుందా? ఇంట్లో.. కన్నబిడ్డల విషయంలోనే తండ్రికి ఉండే పరిమితులు ఇంతగా ఉన్న ఈ రోజుల్లో.. తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున ప్రకటన చేయాలంటే అందరిని కలుపుకుపోవాలి కదా? అదేమీ లేకుండా.. తాను చెప్పినట్లుగా అందరూ వినాలనే స్కూల్ మాష్టారి మాదిరి ఆర్డర్లు వేస్తే.. ఏమవుతుంది? మెగాస్టార్ చిరంజీవి తాజా మాటల్ని చూస్తే అలాంటి పరిస్థితే ఉంది.

నిజానికి చిరంజీవి చెడ్డ మనిషి కాదు. ఆయన కాసింత భోళా మనిషి. డక్కా మొక్కీలు తిని పైకి వచ్చినవాడు.సొంత కష్టంతో.. ఎవరిని నొప్పించకుండా.. అవసరమైతే తానే కాస్త నొచ్చుకుంటూ.. ఆ విషయం బయటకు రాకుండా గుట్టుగా బండి లాగించి.. మెగాస్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి మనిషికి.. సాధారణంగా.. సహజ సిద్ధంగా ఎవరితోనూ గొడవలు.. పంచాయితీలు పెట్టుకోవటం ఇష్టం ఉండదు. ఎవరేం అన్నా.. అన్నంతనే కాసింత కోపం వచ్చినా.. ఆ వెంటనే తనను తాను సర్ది చెప్పుకోవటం చిరులో కొట్టొచ్చొనట్లు కనిపించే గుణం.

ఈ కారణంతోనే..ఆయన అప్పట్లో రాజకీయాల్లోకి వస్తారన్నప్పుడు చాలామంది సందేహంగా చూశారు. చిరంజీవి మైండ్ సెట్ బాగా తెలిసిన వారెవరూ కూడా ఆయనకు రాజకీయాలు సూట్ కావని చెప్పేవారే. అంతవరకు ఎందుకు పార్టీ పెట్టే సందర్భంలో ఆయన్ను కలిసి పొలిటికల్ జర్నలిస్టులు చాలామంది.. తమ భేటీ తర్వాత.. చిరు లాంటి వారు రాజకీయాలకు సెట్ కారని.. ఒకవేళ కావాలంటే ఆయన చాలానే మారాల్సి ఉంటుందని చెప్పేవారు. వారి అంచనాలకు తగ్గట్లే.. రాజకీయాల్లో చిరు ఏం వెనకేసుకున్నారన్నది అందరికి తెలిసిందే.

సినిమాల్లో వీరోచిత నాయకుడిగా చెలరేగిపోయే చిరు..రియల్ లైఫ్ లో మాత్రం నాయకుడి పాత్ర ఆయనకుసెట్ కాదని చెబుతారు. ఎందుకంటే.. నాయకుడికి స్వాభిమానం చాలా ఉంటుంది. ధిక్కారం కూడా ఉంటుంది. తన మీద తనకు బోలెడంత నమ్మకం ఉంటుంది. తనతో ఎవరూ లేకున్నా ఫర్లేదు.. తాను ఏమైనా చేస్తాననే తెగింపు ఉంటుంది. ఇలాంటి గుణాలు చిరులో బొత్తిగా కనిపించవు. ఇదేమీ ఆయన మీద కోపంతో చెప్పటం లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే ఉద్దేశం. చిరును కాసేపు పక్కన పెట్టండి. ఏపీసీఎం జగన్ ను చూడండి.

ఆయనకు అంత క్రేజ్ రావటానికి ఆయన తండ్రి వైఎస్ కొంత సాయం చేస్తే.. అంత పెద్ద సూపర్ పవర్ అయిన సోనియాతో పెట్టుకోవటానికైనా సిద్ధపడ్డారు చూశారా.. అది తెగింపు అంటే. దానికి ఆయన మూల్యం చెల్లించారా? అంటే చెల్లించారు. కానీ.. తనతో గొడవ పెట్టుకున్న సోనియాకు సైతం నష్టం వాటిల్లేలా జగన్ చేయటాన్ని మర్చిపోకూడదు. నాయకుడు అన్నవాడు.. తాను అనుకున్న స్టాండ్ మీద నిలబడాల్సి ఉంటుంది. ఎంతటి ఒత్తిడిలో అయినా సరే.. తనను నమ్ముకున్న వారికి నష్టం కలగకుండా ఉండాలి. ఈ విషయంలో జగన్ తీరు.. చిరు తీరును ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే విషయం అర్థమవుతుంది.

ఒకవైపు సినిమా ఇండస్ట్రీని పట్టుకొని వైసీపీ ఎమ్మెల్యే ఒకరు 'బలిసిన' వ్యాఖ్య చేసినప్పుడు.. ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం.. తమ ఇండస్ట్రీ మీద అంత దారుణమైన వ్యాఖ్య చేస్తారా? అని ప్రశ్నించకున్నా.. నొచ్చుకునేలా మాట్లాడటం సరికాదని చెప్పి.. ఆయన మాటగా.. ఇండస్ట్రీ పడుతున్న వేదనకు చెక్ పడేలా వ్యాఖ్య చేసి ఉంటే బాగుండేది. కానీ.. అలాంటి పని చేయని చిరంజీవి.. తమను అన్న వారి గురించి వివరణ లేకపోగా.. దానికి స్పందించే వారు మాత్రం నోరు మూసుకొని ఉండాలని చెప్పటం.. ఫత్వా జారీ చేయటమే అవుతుంది.

ఏపీ సీఎం జగన్ తో లంచ్ భేటీకి వెళ్లటానికి కొన్ని గంటల ముందు రివీల్ చేసిన ఆయన.. ముఖ్యమంత్రి వారితో కలిసి భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత మాత్రం..తాను త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రినికలుస్తానని.. ఈసారి వంద మందిని వెంట పెట్టుకు వెళతానని ఎలా ప్రకటన చేస్తారు? వెళ్లే ముందు కూడా ఆ వంద మందితో మాట్లాడి ఉంటే.. ఈ మాట చెప్పే అర్హత ఉంటుంది. అందుకు భిన్నంగా..నాకు నచ్చింది చేస్తాను.. మీరంతా మూసుకొని ఫాలోకండి అన్న అర్థం వచ్చేలా చిరు మాటలు.. ఆయనకున్న కొండంత ఇమేజ్ కరిగిపోయేలా చేస్తుందన్న చిన్న విషయాన్ని ఎలా మిస్ అయ్యారు. తనకు సూట్ కాని పాత్రల్ని చేయకూడదన్న విషయం ఇన్ని సినిమాల్లో నటించిన చిరుకు అర్థం కాకపోవటం ఏమిటి? అలా చేస్తే.. దారుణ డిజిస్టార్ అవుతుంది కదా మెగాస్టార్?