Begin typing your search above and press return to search.

తెలంగాణకు మెగా టెక్స్ టైల్.. కేటీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది..

By:  Tupaki Desk   |   18 March 2023 12:53 PM GMT
తెలంగాణకు మెగా టెక్స్ టైల్.. కేటీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది..
X
తెలంగాణపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు మరోసారి నిరూపణ అయింది. రాష్ట్ర చేనేత కార్మికులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో టెక్స్ టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. అయితే ఇన్నాళ్లు కేంద్రంపై తాము చేసిన పోరాటం ద్వారానే టెక్స్ టైల్ పార్క్ తెలంగాణకు వచ్చిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్ సొంత నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నందున టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ పోరాటానికి కేంద్రం దిగొచ్చిందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు.

పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులను తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ అత్యాధునిక సౌకర్యాలతో టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ తెలిపారు. అయితే ఈ టెక్స్ టైల్ పార్క్ లతో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. జౌళి రంగంలో భారత్ మొదటిస్థానంలో నిలపడానికి, ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ఆత్మ నిర్బర కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది.

బీఆర్ఎస్, బీజేపీ మధ్య గతేడాదిగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు నిత్యం కొనసాగుతున్నాయి. ఇటీవల ఆ పార్టీ నేత కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని పదే పదే అడుగుటున్నారు. తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మోదీ అభివృద్ది చేస్తున్నారని విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్రం నిధులు విడుదల చేయడంలో చిన్న చూపు చూస్తుందని అన్నారు.

తెలంగాణలో బీజేపీ పట్టు రోజురోజుకు పెరిగిపోతుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఢిల్లీ నేతలు రాష్ట్రంలో అప్పుడప్పుడూ పర్యటిస్తున్నారు. అవసరమైన చోట నిధులు విడుదల చేసేందుకు వెనుకావడం లేదు. అయితే కేటీఆర్ ఎప్పటినుంచో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దమ్ముంటే తెలంగాణలో అభివృద్ధి చూపించి మాట్లాడాలని పలు సార్లు సవాల్ విసిరిరారు.

ఇక ఇటీవల ఉద్యోగాల నియామకాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, టీఎస్ పీఎస్ సీ కమిషన్ తప్పిదాలకు ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే టెక్స్ టైల్ పార్క్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం మరింత హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.