Begin typing your search above and press return to search.

తెలంగాణలో మూతబడ్డ 'మీ సేవ' ..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   13 Dec 2019 5:23 AM GMT
తెలంగాణలో మూతబడ్డ మీ సేవ ..ఎందుకంటే ?
X
మీ సేవ ..ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సంస్థలలో ఇది కూడా ఒకటి. ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం ఏది కావాలన్న కూడా మీ సేవ ద్వారానే తీసుకోవాలి. బర్త్ సర్టిఫికెట్ - ఇన్ కమ్ సర్టిఫికెట్ ..అలాగే ఆధార్ కార్డ్ లో ఏదైనా మార్పులు - చేర్పులు చేయాలన్న కూడా మీ సేవ కి వెళ్లాల్సిందే. దీనితో ప్రతి ఒక్కరు కూడా మీ సేవ కి బాగా అలవాటు పడ్డారు. అలాంటి మీ సేవ సేవలకు తెలంగాణలో తాత్కాలికంగా బ్రేక్ పడనుంది.

ఈ రోజు సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవ కేంద్రాలు మూతపడనున్నాయి. ఈ విషయాన్ని నిజామాబాద్ జిల్లా ఈడీఎం కార్తీక్ ఓ ప్రకటనలో తెలిపారు. మీ-సేవా ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు డేటాబేస్ మైగ్రేషన్ చేపడుతున్నామని.. అందుకోసం మూడు రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. అడ్వాన్స్‌ డ్ ఫీచర్లను జోడించబోతున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలో డిసెంబరు 13న రాత్రి 7 గంటల నుంచి 16 ఉదయం వరకు రాష్ట్రంలోని మీ-సేవా కార్యాలయాలన్నీ మూసి ఉంటాయని వెల్లడించారు. డిసెంబరు 16న ఉదయం 8 గంటలకు మళ్లీ మీ సేవా సర్వీస్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కార్యాలయాలకు ముందస్తు సమాచారం పంపినట్లు ప్రకటనలో తెలిపారు. మీ-సేవ నిర్వాహకులు కూడా ముందుగానే ఈ అంతరాయం గురించి ప్రజలకు వివరించాలని ఈఎండీ కార్తీక్ సూచించారు. అలాగే ప్రజలు ఏదైనా అత్యవసర సర్టిఫికెట్స్ ఉంటే ఈ రోజు సాయంత్రం లోపు తీసుకోవాలని - ప్రజలు కూడా సహకరించాలని కార్తీక్ కోరారు.