ముంబై లో భారీ అగ్ని ప్రమాదం .. భయంతో 19వ అంతస్తు దూకిన వ్యక్తి !

Fri Oct 22 2021 17:42:34 GMT+0530 (IST)

Massive fire in Mumbai

ముంబై మహానగరం లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని పరేల్‌లోని లాల్ బాగ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ భారీ అంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు.  61 అంతస్తులు ఉన్న ఆ భవనంలో 19వ అంతస్తులో మంటలు చెలరేగిన ఘటనలో ఇప్పటి వరకూ ఒకరు సజీవదహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. 19 వ అంతస్తులో మంటలు అంటుకోగా.. ఓ వ్యక్తి దానిపై నంచి దూకుతున్న వీడియోలు బయటకు వచ్చాయి.అతడిని అరుణ్ తివారీ అనే వ్యక్తిగా గుర్తించారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని చికిత్స కోసం కేఈఎం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ భవనంలోని ప్రజలను కాపాడేందుకు మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు ప్రమాద స్థలానికి చేరుకొని శ్రమిస్తున్నాయి. సెంట్రల్ ముంబై అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం అవిఘ్న పార్క్ బిల్డింగ్ లోని 19వ అంతస్థులో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ మంటలను ఆర్పేందుకు 12 అగ్నిమాపక శకటాలు కృషి చేస్తున్నాయి. వాటర్ ట్యాంకర్లను కూడా తరలించారు.  

ముంబయి మేయర్ కిశోర్ పెండ్నేకర్ సహా సీనియర్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవంతి నుంచి చాలా మందిని సురక్షితంగా కాపాడారు. ఓ వ్యక్తి భయంతో భవనం నుంచి దూకేశారు. ఇందులో అగ్నిమాపక సిబ్బంది వైఫ్యలం లేదు. దీనిపై ఎటువంటి దుష్ప్రచారం చేయవద్దు  అని ముంబయి మేయర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  అయితే ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అలాగే ప్రాణ ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా కర్రీ రోడ్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను సైతం పోలీసులు నిలిపివేశారు. ఘటన స్థలానికి ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ పోలీసులు అధికారులు చేరుకున్నారు.