Begin typing your search above and press return to search.

అలాస్కా తీరంలో భారీ భూకంపం ... సునామీ హెచ్చరిక

By:  Tupaki Desk   |   20 Oct 2020 8:30 AM GMT
అలాస్కా తీరంలో భారీ భూకంపం ...   సునామీ హెచ్చరిక
X
అమెరికా అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.5 గా నమోదైంది. దాని వల్ల సోమవారం చిన్నపాటి సునామీ తీరానికి వచ్చింది. అయితే, భూకంపం వల్ల ఎంత నష్టం వచ్చిందన్నది, ఎంత మంది చనిపోయారన్నది ఇంకా అంచనా వెయ్యలేదు. వచ్చింది భారీ భూకంపం కాబట్టి, నష్టం కూడా భారీగానే ఉండొచ్చనే అనుమానం ఉంది. సునామీ హెచ్చరికలు జారీ చేయగానే, తీరం వెంట ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

అలాస్కాలోని శాండ్ పాయింటుకు ఆగ్నేయంగా 55 మైళ్ల దూరంలో సోమవారం సాయంత్రం 4.54 గంటలకు 7 నిమిషాల పాటు భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సునామీ లేదా సముద్రంలో భారీ అలలు ఎగసిపడే ప్రమాదముందని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం వివరించింది. అలాస్కా సముద్ర తీరంలో అమెరికా అలర్ట్ ప్రకటించింది. శాండ్ పాయింట్ తీరంలో అలలు, 2 అడుగుల ఎత్తుకి ఎగసిపడ్డాయని రికార్డ్ అయ్యింది. తీరం నుంచి 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అందువల్ల కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకూ ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్ల దూరంలో అంకోరేజ్ నగరం ఉంది. అక్కడ వరకూ భూకంపం ప్రభావం ఉండవచ్చంటున్నారు. మొదట్లో భారీ సునామీ రావచ్చని అంచనా వేసినా తర్వాత స్వల్ప సునామీగా హెచ్చరికను మార్చారు.

ఈ భూకంప, సునామీ ప్రభావం వందల కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని అంకోరేజ్ నగరం వద్ద ఈ భూకంప, సునామీ ప్రభావం ఆగిపోతోందని తెలిపారు. కాగా, సునామీ ప్రభావం అంత పెద్దగా ఉండబోదని ఎన్ ఓ ఏఏ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల వరకే దీని ప్రభావం కొంత మేర ఉంటుందని తెలిపింది. భూకంపానికి ముందు, ఐదు సార్లు 5.0 తీవ్రతతో చిన్న భూకంపాలు వచ్చాయంటున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన భూకంపానికి దగ్గర్లోనే మూడు నెలల కిందట 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అలస్కా ప్రాంతం, అగ్ని పర్వతాలు ఉండే రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది. అందువల్ల అక్కడ తరచుగా భూమిలో పలకలు కదులుతూనే ఉంటాయి. అందువల్లే భారీ భూకంపాలు వస్తున్నాయని అంటున్నారు.