Begin typing your search above and press return to search.

ఆర్కే మృతిపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన .. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్న భార్య !

By:  Tupaki Desk   |   15 Oct 2021 10:15 AM GMT
ఆర్కే మృతిపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన .. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్న భార్య !
X
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిని.. మావోయిస్టు పార్టీ ధృవీకరించింది.ఈ నెల 14న ఉదయం 6 గంటలకు ఆయన చనిపోయినట్టు ప్రకటించారు మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్. కిడ్నీలు ఫెయిల్ అవడంతో చనిపోయినట్టు తెలిపారు. చికిత్స చేసినా ఆర్కేను కాపాడులేకపోయామని ప్రకటించారు. విప్లవ శ్రేణుల మధ్యే అంత్యక్రియలు జరిగినట్టు పార్టీ స్పష్టం చేసింది. ఆర్కే మరణ వార్త విని, ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు ఆర్కే భార్య శిరీష. అడవి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారని ఆరోపించారామె.

ఆయన జీవితం ప్రజల కోసం ధారపోశారని, ప్రజా ఉద్యమంలో ఆర్కే ఒక యోధుడని కొనియాడారు. ఆయన నిస్వార్థ విప్లవకారుడని ప్రశంసించిన ఆమె.. ఉద్యమంలో బిడ్డను కూడా పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్కే ప్రజల కోసం 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని, ఉద్యమం కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయలేదన్నారు. ఆర్కే ప్రజా హృదయాల్లో నిలిచి ఉంటారని అన్నారు విరసం నేత కళ్యాణ్ రావు. పోలీసుల నిర్భంధం చేయడం ద్వారానే ఆయన చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

మావోయిస్టు పార్టీ అగ్రనేత, చర్చల రామకృష్ణగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు ఆర్కే.. దండకారణ్యం పరిధిలోని బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం మరణించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ముందుగానే ధ్రువీకరించినా, మావోయిస్టు పార్టీ తాజాగా అయన మృతిని ధృవీకరించింది. ఆర్కే గత నాలుగు దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమంలో కొనసాగుతున్నారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీలో సభ్యుడిగానూ ఆయన ఉన్నారు.

కామ్రేడ్ రామకృష్ణ అమరత్వం పార్టీకి తీరని లోటని వెల్లడించారు. కామ్రేడ్ హరగోపాల్ 1958లో గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో జన్మించారు. తండ్రి ఒక స్కూల్ టీచర్ కాగా.. హరగోపాల్ పీజీ పూర్తిచేశారు. కొంత కాలం తండ్రితో పాటు టీచర్‌ గా పని చేశారు. 1978లో మావోయిస్ట్ విప్లవానికి ఆకర్షితులై పీపుల్స్ వార్‌ లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 1980లో గుంటూరు జిల్లా పార్టీ కాన్ఫరెన్స్‌ లో పాల్గొని.. 1982 నుంచి పూర్తికాలం కార్యకర్తగా వచ్చారు. గుంటూరు పల్నాడు ప్రాంతంలో గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. ఆ క్రమంలో విప్లవోద్యమ నాయకత్వంగా ఎదిగి 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా.. 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన తరువాత దక్షిణ తెలంగాణ ఉద్యమానికి నాలుగేళ్ల నాయకత్వం వహించారు.

2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడంతో పాటు, 2001లో జనవరిలో జరిగిన పీపుల్స్‌ వార్ 9వ కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైనారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మధ్యలో జరిగిన చర్చల్లో పార్టీ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించారు. ప్రభుత్వం ముందు ప్రజల డిమాండ్లను పెట్టి తన ప్రతినిధుల బృందంతో పాటు సమర్ధవంతంగా చర్చించారు. ఈ చర్చల ప్రక్రియలో పార్టీ రాజకీయ దృక్పథాన్ని రాష్ట్ర, దేశ ప్రజల్లోకి వ్యాప్తి చేశారు. ప్రభుత్వం చర్చల నుంచి వైదొలగి తీవ్ర నిర్బంధం ప్రయోగించి కామ్రేడ్ రామకృష్ణనను హత్య చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించగానే, ఆయన్ని ఏఓబీ ఏరియాకు కేంద్ర కమిటీకి బదిలీ చేసి, ఏఓబీ బాధ్యతలు అప్పగించారు. 2014 వరకు ఏఓబీ కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఏవోబీని కేంద్ర కమిటీ నుంచి గైడ్ చేసే బాధ్యత నిర్వహిస్తున్నాడు.2015లో కాయన్ని కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో నియమించింది. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న అత్యంత నిర్బంధ కాండలో పార్టీని, కేడర్లను రక్షించే కార్యక్రమాన్ని ఎంతో దృఢంగా నిర్వహిస్తున్నారు.