Begin typing your search above and press return to search.

హేమంత్ హత్య : డబ్బు లేదనే హత్యకి ఒడిగట్టారా!

By:  Tupaki Desk   |   25 Sep 2020 12:30 PM GMT
హేమంత్ హత్య :  డబ్బు లేదనే హత్యకి ఒడిగట్టారా!
X
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య జరిగి రెండేళ్లు పూర్తి అయినా కూడా ఆ హత్య తాలూకు సంఘటలు ఇంకా ఎవరు మర్చిపోలేదు. ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రణయ్ హత్య తరహాలోనే ఇప్పుడు మరో పరువు హత్య జరిగింది. తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడి పరువు హత్య సంచలనం సృష్టిస్తుంది. పెద్దలకి ఇష్టం లేకున్నా , వారిని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకొని గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలోనే నివాసముంటున్నారు.

కూతురు తమ కులం వారిని కాకుండా మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడిందన్న కోపంతో , తన పరువు మంట గలిపింది అని తీవ్ర అక్రోశంలో ఉన్న అవంతి తండ్రి.. హేమంత్ ను చంపేందుకు ప్లాన్ వేశాడు.పక్కా ప్లాన్ తో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు హేమంత్ ను కిడ్నాప్ చేశారు. దీనికి ముందు కుటుంబ సభ్యులు వారిని బాగా నమ్మించి ఇంటి నుండి బయటకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. కిడ్నాపర్ల నుండి తప్పించుకున్న అవంతి, హేమంత్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకి ఫిర్యాదు చేసింది. హేమంత్ కోసం వెతుకుతున్న పోలీసులకు శుక్రవారం ఉదయం సంగారెడ్డిలో శవమై కనిపించాడు.

కొడుకు చనిపోయాడని తెలుసుకున్న హేమంత్ తల్లిదండ్రులు.. అవంతి కుటుంబ సభ్యులకు ప్రేమ పెళ్లి ఇష్టంలేకే తమ కొడుకుని దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. నిజానికి వాళ్ల కులం కన్నా, తమ కులమే ఎక్కువ అని, తమకు డబ్బు లేదన్న కారణంతోనే అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని హత్య చేయించారని హేమంత్ తండ్రి వాపోయారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి తో పాటు వారి బంధువులైన సందీప్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, రంజిత్‌ రెడ్డి, యుగేందర్‌ రెడ్డి, విజయేందర్‌ రెడ్డి లే తమ కొడుకుని దారుణంగా చంపేశారని హేమంత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

తన భర్త హత్య పై స్పందించిన అవంతి ... చిన్నప్పటి నుంచి తామిద్దరం ఒకే ప్రాంతంలో పెరిగామని, ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న మేము , తమ పెళ్ళికి మా ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఈ ఏడాది జూన్ లో వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. పెళ్లికి ముందు తమ ప్రేమ విషయం తెలిసి 7 నెలల పాటు తనను ఇంట్లోనే ఉంచారని, ఆ తర్వాత వారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు పలుమార్లు బెదిరించినట్లు తెలిపింది. తన తండ్రి తరపు వాళ్ల నుంచి అపాయం ఉండటంతో ముందుగానే పోలీసులతో మాట్లాడి రాజీ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది అవంతి. కానీ , తన తండ్రి ఇంత ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని చెప్తూ కన్నీరుమున్నీరు అయింది.