Begin typing your search above and press return to search.

భాగస్వామిని ముక్కలు చేసి.. కుక్కర్‌ లో ఉడికించాడు!

By:  Tupaki Desk   |   8 Jun 2023 12:03 PM GMT
భాగస్వామిని ముక్కలు చేసి.. కుక్కర్‌ లో ఉడికించాడు!
X
శ్రద్ధావాకర్‌ హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తన ప్రియురాలికి ముక్కలుగా కోసి, ప్లాస్టిక్ బ్యాస్ లో పెట్టి, ఫ్రిడ్జ్ లో దాచిన ఆ ఘోర సంఘటనను ఇంకా మర్చిపోకముందే.. అదే తరహాలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మరోకేసు వెలుగుచూసింది.

తన సహజీవన భాగస్వామిని హత్యచేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసి, కుక్కర్ లో ఉడికించిన వ్యక్తి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... మనోజ్ సహాని (56) అనే వ్యక్తి వివాహం చేసుకుని అతని భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఇదే సమయంలో సరస్వతి వైద్య (36) అనే వివాహిత కొన్ని సంవత్సరాల క్రితం భర్తను వదిలేసిన ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది. భార్యను వదిలేసిన మనోజ్ కూడా అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. ఫలితంగా చూపులు కలిసిన శుభవేళ ఈ ఇద్దరు సహజీవనం మొదలుపెట్టారు.

ఎంత స్టైల్ గా సహజీవనం అని పిలిచినా... ఇది అక్రమ సంబంధమే అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ సంబంధంలో ఇద్దరిమధ్యా గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో అసహనం హద్దులు దాటిందో ఏమో ఆమెను హత్య చేశాడు.

అక్కడితో తన ఆగ్రహం చల్లారలేదో.. లేక, బాడీని మాయం చేసే క్రమంలోనో తన ప్రియురాలి మృతదేహాన్ని చెట్లు కత్తిరించే కట్టర్‌ తో ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం ఆమె శరీరంలోని కొన్ని భాగాలను కుక్కర్ లో ఉడకబెట్టాడని ముంబాయి పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఈ హత్య జరిగి ఎన్ని రోజులు అయ్యిందనే విషయం ఇంకా వెలుగులోకి రాలేదు కానీ... తాజాగా జూన్ 7 - బుధవారం సాయంత్రం మనోజ్, సరస్వతి నివసించే ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో స్థానికులు నయానగర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా... ఆ ఇంట్లో శరీర భాగాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. దీంతో... మూడు నాలుగు రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. తామంతా మృతురాలికి న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని, ఈ కేసుకు సంబంధించిన ఏవైనా వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే తమను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.

ఈ సందర్భంగా మృతుల వివరాలు తెలిపిన పోలీసులు... నిందితుడు మనోజ్‌.. బోరివాలీ ప్రాంతంలో ఒక దుకాణం నడుపుతున్నాడని తెలిపారు. ఇదే సమయంలో మృతురాలు సరస్వతి ఒక అనాధ అని గుర్తించారు.

అయితే ఈ సందర్భంగా... గత ఏడాది వెలుగులోకి వచ్చిన శ్రద్దావాకర్‌ హత్య గుర్తుకువస్తుందని అంటున్నారు పరిశీలకులు. కాల్ సెంటర్ ఉద్యోగిని శ్రద్ధాను ఆమె సహజీవన భాగస్వామి ఆఫ్తాబ్‌ పూనావాలా అతి దారుణంగా హత్య చేసి, శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు.

వాటిని కొంతకాలం ఫ్రిడ్జ్ లో దాచాడు. అనంతరం పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఆ భాగాలను 18 రోజుల పాటు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పారేశాడు. ఆమె తండ్రి ఫిర్యాదుతో ఆరు నెలల తర్వాత అతడి అకృత్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.