Begin typing your search above and press return to search.

దీదీ డేరింగ్... బెంగాల్ లో సీఏఏ అమలు చేయరట

By:  Tupaki Desk   |   27 Jan 2020 2:01 PM GMT
దీదీ డేరింగ్... బెంగాల్ లో సీఏఏ అమలు చేయరట
X
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో ఢీ అంటే ఢీ అంటూ సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మోదీ సర్కారు ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను బెంగాల్ లో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి పారేశారు. సీఏఏను అమలు చేయబోమని కేవలం ప్రకటన వెలువరించడంతోనే సరిపెట్టని దీదీ... ఏకంగా సీఏఏకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఏకంగా తీర్మానాన్ని ఆమోదింపజేశారు. దీదీ చర్యతో ఇప్పటిదాకా సీఏఏకు రెడ్ సిగ్నల్ వేసిన రాష్ట్రాల సంఖ్య నాలుగుకు చేరింది.

సీఏఏను అమలు చేసేది లేదని ఇదివరకే తేల్చి చెప్పిన రాష్ట్రాల్లో కేరళ, పంజాబ్, రాజస్థాన్ లు ఉన్నాయి. తాజాగా బెంగాల్ ను కూడా ఈ రాష్ట్రాల జాబితాలో చేర్చేసిన దీదీ... మోదీ సర్కారుకు తానేమీ భయపడేది లేదని తేల్చి చెప్పినట్టైందన్న వాదన వినిపిస్తోంది. సోమవారం బెంగాల్ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన దీదీ... ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏను నిరసిస్తూ సాగిన ర్యాలీలకు ముందుండి నడిపించిన మైనారీటీలకే కాక.. హిందూ సోదరులకు కూడా తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం.. ఈ దేశ పౌరుడు కావాలంటే ఒకరు ‘ విదేశియుడు’ కావాలని పేర్కొన్న దీదీ... ఇది దారుణమైన గేమ్ అని.. మృత్యువుకు ప్రజలను దగ్గర చేయడమేనని.. దయ చేసి బీజేపీ వలలో పడకండని ఓకింత సంచలన వ్యాఖ్యలే చేశారు.

సీఏఏతో పాటు ఎన్పీఆర్ చట్టాలపై తాము శాంతియుతంగా పోరాడుతామని దీదీ చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని దీదీ బీజేపీని.. పాకిస్తాన్ ‘బ్రాండ్ అంబాసిడర్’ గా అభివర్ణించారు. బీజేపీ నేతలు హిందూస్తాన్ గురించి కన్నా పాకిస్తాన్ గురించి ఎక్కువగా మాట్లాడుతారని సెటైర్లు వేశారు. మొత్తంగా సీఏఏను వ్యతిరేకిస్తూ దీదీ బెంగాల్ అసెంబ్లీలో ఏకంగా తీర్మానం ఆమోదించడం చూస్తుంటే... ఎన్పీఆర్ విషయంలోనూ బెంగాల్ లో బీజేపీ సర్కారుకు ఎదురు దెబ్బ తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.