Begin typing your search above and press return to search.

నిద్రకు తగ్గట్లే వీర్యం నాణ్యత.. అదెలా చెప్పిన రిపోర్టు

By:  Tupaki Desk   |   29 May 2023 10:25 AM GMT
నిద్రకు తగ్గట్లే వీర్యం నాణ్యత.. అదెలా చెప్పిన రిపోర్టు
X
కంటి నిండా నిద్రకు నాణ్యమైన వీర్యానికి లింకు ఉందా? చదివినంతనే ఆశ్చర్యానికి గురి అవుతారు కానీ అదెంతో నిజమని చెబుతున్నారు వైద్య నిపుణులు. నూటికి తొంభై శాతం మందికి అవగాహన లేని ఈ విషయాన్ని తెలుసుకోవటం ద్వారా.. ఆనందకరమైన జీవితాన్ని పొందొచ్చన్న మాటను వారు చెబుతున్నారు. మన పెద్దోళ్లు తొందరగా పడుకొని పొద్దున్నే లేవాలన్న మాట తరచూ చెబుతుండటం గుర్తు చేసుకుంటే.. మనోళ్లు ఆ రోజుల్లోనే శాస్త్రీయంగా ఆలోచించి చెప్పారన్న విషయం తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

నిద్రకు పురుషుడి వీర్యానికి బోలెడంత లంకె ఉంటుందని చెబుతున్నారు. నిద్ర మరీ తగ్గినా.. అదే సమయంలో మరీ ఎక్కువైనా వీర్యం నాణ్యతను దెబ్బ తీస్తుందన్న విషయాన్ని శాస్త్రీయంగా గుర్తించారు. చైనాకు చెందిన పరిశోధకులు నిద్రకు.. పురుషుడి వీర్యానికి ఉన్న లింకును తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగా కొందరిని 6 గంటలు.. అంతకంటే తక్కువ సమయం.. మరికొందరు 7-8 గంటలపాటు.. ఇంకొందరిని 9 గంటలు.. అంతకంటే ఎక్కువసేపు నిద్రపోవాలని సూచన చేశారు. అనంతరం వీరి వీర్యాన్ని సేకరించి.. వీర్య కణాల సంఖ్య.. రూపు.. వాటి కదలికలపై పరిశోధన చేశారు.

వీర్యాన్ని సేకరించిన వారిలో 7-8 గంటల పాటు నిద్రపోయిన వారి వీర్యం నాణ్యంగా ఉందన్న విషయాన్ని గుర్తించారు. అరు గంటల కంటే తక్కువ నిద్ర పోయిన వారు.. తొమ్మిది గంటల కంటే ఎక్కువగా నిద్ర పోయిన వారి వీర్యం నాణ్యతలో తేడా ఉందన్న విషయాన్ని గుర్తించారు. లేటుగా నిద్రపోవటం.. తగినంత రెస్టు లేకపోవటం చాలా హానికరంగా చెబుతున్నారు.

నిద్ర తక్కువగా పోయే వారిలో.. ఎక్కువగా నిద్ర పోయే వారిలో ఆరోగ్యకరమైన వీర్యకణాల్ని దెబ్బ తీసే ప్రోటీన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించారు.

ఈ కారణంతోనే సంతాన్ని కోరుకునే పురుషుడు రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవటం.. త్వరగా పడుకోవటం చాలా అవసరమని చెబుతున్నారు. పడుకోవటానికి రెండు.. మూడు గంటల ముందు డిన్నర్ పూర్తి చేయటం.. నిద్రకు ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం.. మనసుకు నచ్చిన సంగీతాన్ని వింటూ.. తక్కువ వెలుతురు ఉన్న గదిలో వదులు వస్త్రాలతో పడుకోవటం ద్వారా నిద్ర బాగా పడుతుందని చెబుతున్నారు. సో.. మీరూ ట్రై చేయండి.