Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రి తాజా మాట విన్నాక.. ఈవీ కారును ఇట్టే కొనేద్దామనుకోవటం ఖాయం

By:  Tupaki Desk   |   5 Dec 2021 4:34 AM GMT
కేంద్రమంత్రి తాజా మాట విన్నాక.. ఈవీ కారును ఇట్టే కొనేద్దామనుకోవటం ఖాయం
X
వాహన రంగంలో ఈవీ వెహికిల్స్ ఇప్పుడో సంచలనం. మోపెడ్.. బైక్ కొనాలనుకునే వారికి పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ.. కారు కొనాలనుకునే వారికి మాత్రం ఇబ్బందే. ఈవీ కారు కొనటం పెద్ద విషయం కాకున్నా.. వాటికి చార్జింగ్ స్టేషన్ల విషయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈవీ కార్లను కొనాలన్న ప్లాన్ ఉన్న వారు ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నది ఈవీ స్టేషన్ల గురించే. ఇలాంటివేళ.. వారికున్న సందేహాల్ని తీర్చేలా.. రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈవీ స్టేషన్ల గురించి గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి మహేంద్రనాథ్ పాండే.

ఫేమ్ ఇండియా పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 70వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో 22 వేల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై తాజాగా కేంద్రమంత్రి మహేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఎక్స్ ప్రెస్ హైవేస్.. హైవేస్.. నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హైవేకు ఇరువైపులా ప్రతి పాతిక కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

బారీ ఎలక్ట్రికల్ వెహికిల్స్ కు ప్రతి వంద కిలోమీటర్ల కు ఒక ఛార్జింగ్ స్టేషన్.. నగరాల్లోని గ్రిడ్ పరిధిలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. త్వరలోనే భారీ ఎత్తున ఈవీ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అదే జరిగితే.. ఈవీ వాహనాల్ని కొన్న వారికే కాదు.. ఈవీ వాహనాల్ని కొనాలన్న ప్లాన్ ఉన్న వారికి ఉన్న సందేహాలు తీరిపోవటమే కాదు.. వెంటనే కొనాలన్న ప్లాన్ నుంచి ముందుకు వెళ్లటం ఖాయమని చెప్పకతప్పదు.