Begin typing your search above and press return to search.

ఒమ్రికాన్ పై మహారాష్ట్ర కొత్త గైడ్ లైన్స్.. తెలుగు రాష్ట్రాల మాటేంటి?

By:  Tupaki Desk   |   28 Nov 2021 5:46 AM GMT
ఒమ్రికాన్ పై మహారాష్ట్ర కొత్త గైడ్ లైన్స్.. తెలుగు రాష్ట్రాల మాటేంటి?
X
కరోనా కథ కంచికి.. మనం ఇంటికి అన్నట్లుగా ఇప్పుడిప్పుడే..మహమ్మారి భయం నుంచి బయటకు వస్తున్న వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా.. కొత్త భయాలతో వణికేలా చేస్తోంది 'ఒమ్రికాన్'. ఈ కొత్త వేరియంట్ లొని సంక్లిష్టత.. రెండు డోసులు టీకా వేసుకున్న వారిని ఈ వేరియంట్ వణికిస్తున్న వేళలో అన్ని దేశాలు అలెర్టు అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. ప్రధాని మోడీ సైతం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే.

ఒమ్రికాన్ వేళ.. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త వేరియంట్ కట్టడికి ముందే అలెర్టు అయితే.. దాని కారణంగా ఎదురయ్యే నష్టం కొంతలో కొంత తగ్గటం ఖాయం. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. ఒమ్రికాన్ నేపథ్యంలో అలెర్టు అయిన మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ ను సిద్ధం చేసింది. వాటిని తక్షణం అమల్లోకి వచ్చేలా ఆదేశాల్ని జారీ చేసింది. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతూ ఆదేశాలు జారీ చేయగా.. రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉంటాయంటున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త గైడ్ లైన్స్ ను చూస్తే..

- విదేశాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికులు కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తప్పక పాటించాలి.
- రాష్ట్రానికి వచ్చే దేశీయ ప్రయాణికులు తప్పనిసరిగా టీకా రెండు డోసులు తీసుకొని ఉండాలి.
- రాష్ట్రానికి వచ్చేందుకు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు సర్టిఫికేట్ తమ వెంట తీసుకురావాలి.
- బస్సు.. టాక్సీ.. ఇతర వాహనాల్లోకొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు
- నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా గుర్తిస్తే.. డ్రైవర్.. కండక్టర్ కు రూ.500చొప్పున ఫైన్
- ఒకవేళ ప్రైవేటు బస్సుల్లో అయితే.. ట్రాన్స్ పోర్టు యజమానికి రూ.వెయ్యి జరిమానా విధిస్తారు
- ఏదైనా ప్రోగ్రాంకు హాజరయ్యే వారంతా తప్పనిసరిగా రెండు టీకా డోసుల్ని పూర్తి చేసి ఉండాలి.
- ఇక ఏదైనా వేడుకను నిర్వహించే నిర్వాహకులు మొదలు కొని బంధువులు.. సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాలి.
- అంతేకాదు.. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లో ప్రయాణించాలంటే తప్పనిసరిగా రెండు డోసులు తీసుకున్న వారికే ప్రవేశం.
- సినిమాహాళ్లు.. ఫంక్షన్ హాళ్లు వంటి వాటిల్లో 50 శాతం మందికి మాత్రమే అనుమతి.
- సౌతాఫ్రికా నుంచి ముంబయి ఎయిర్ పోర్టుకు వచ్చే వారు తప్పకుండా క్వారంటైన్ కు వెళ్లాల్సిందే.

ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. వాటిని వెంటనే అమలు చేసేలా మహారాష్ట్ర ప్రభుత్వం ముందుంటే.. అలాంటి వాటి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అధికారికంగా ఆదేశాల్ని జారీ చేసింది లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఉండదన్న విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.