Begin typing your search above and press return to search.

కాక‌తీయుల వార‌సుడు ఎవ‌రు? ఇన్నాళ్లు ఎక్క‌డున్నాడు?

By:  Tupaki Desk   |   6 July 2022 9:36 AM GMT
కాక‌తీయుల వార‌సుడు ఎవ‌రు? ఇన్నాళ్లు ఎక్క‌డున్నాడు?
X
చారిత్ర‌క వ‌రంగ‌ల్ కు ఓ చ‌రిత్ర వుంది. వంద‌ల ఏళ్ల క్రితం కాక‌తీయ రాజులు ఓరుగ‌ల్లుని రాజ‌ధానిగా చేసుకుని సువిశాల కాక‌తీయ సామ్రాజ్యాన్ని పాలించిన నేల ఇది. రాణి రుద్ర‌మ‌దేవి, ప్ర‌తాప‌రుద్రులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆ వైభ‌వానికి గుర్తుంగా ఇప్ప‌టికీ వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని ప్ర‌ధాన ర‌హ‌దారికి స‌మీపంలోని వేయి స్థంభాల ఆల‌యం.. కిలా వ‌రంగ‌ల్ కోట‌.. కాక‌తీయుల క‌ళాతోర‌ణం ఇప్ప‌టికి గ‌త చిత్ర‌కు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తూ నేటి త‌రానికి కూడా కాక‌తీయుల వైభ‌వాన్ని గుర్తు చేస్తున్నాయి. కాక‌తీయుల వైభ‌వాన్ని నేటి త‌రాల‌కు తెలియ‌జెప్పాల‌నే స‌దుద్దేశ్యంతో తెలంగాణ ప్ర‌భుత్వం కాక‌తీయ వైభ‌వ వారోత్సవాల‌ని జూలై 7న వ‌రంగల్ న‌గ‌రంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంది.

ఈ వారోత్స‌వాల్లో పాల్గొన‌డానికి ప్ర‌త్యేక అతిథిగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలోని జ‌గ‌ద‌ల్పూర్ లో కాక‌తీయుల వార‌సులుగా భావిస్తున్న క‌మ‌ల్ చంద్ర‌భంజ్ దేవ్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఆహ్వానించింది, కాక‌తీయుల సామ్రాజ్యం అంత‌మైన దాదాపు 800 సంవ‌త్స‌రాల త‌రువాత కాక‌తీయ సామ్రాజ్య వార‌సులు ఓరుగ‌ల్లు గ‌డ్డ‌పై ఒక చారిత్ర‌క సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అడుగుపెడుతుండ‌టం ప్ర‌త్యేక‌త‌ని సంత‌రించుకుంది.

వ‌రంగ‌ల్ కు వ‌స్తున్న కాక‌తీయుల వార‌సుడు క‌మ‌ల్ చంద్ర‌దేవ్ భంజ్ ఎవ‌రు? ఇన్నాళ్లూ ఎక్క‌డున్నాడు?.. వీరి సామ్రాజ్యం ఎక్క‌డ వుంది? .. కాక‌తీయుల‌కు క‌మ‌ల్ చంద్ర‌దేవ్ భంజ్ కున్న సంబంధం ఏంటీ? ఇన్నేళ్ల త‌రువాత వీరి గురించి బ‌య‌టికి ఎలా తెలిసింది? ..ఇప్ప‌డు కాక‌తీయుల రాజ‌ధాని వ‌రంగ‌ల్ గ‌డ్డ‌కు రావడంపై వ‌రంగ‌ల్ ప్ర‌జ‌లు.. తెలంగాణ వారే కాకుండా యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. క‌మ‌ల్ చంద్ర‌దేవ్ భంజ్ ఎవ‌రు? వ‌ఈరి చ‌రిత్ర ఏంటీ?.. ప్ర‌తాప‌రుద్రుడి తోనే కాక‌తీయ సామ్రాజ్యం..వారుసుల అంతం కాలేదా? కాక‌తీయుల‌కు నిజంగానే భంజ్ దేవ్ వంశ‌స్తులు వార‌సులా? అనేక వివ‌రాలు తాజాగా బ‌య‌టికి వ‌చ్చాయి.

ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాతే వీరి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ద‌క్షిణాప‌థాన్ని దాదాపు రెండు శ‌తాబ్దాల‌కు పైగా పాలించింది కాక‌తీయ వంశం. కాక‌తీయ సామ్రాజ్యంలో ప్ర‌తాప‌రుద్రుడు చివ‌రి రాజు. 1290 నుంచి 1323 వ‌ర‌కు ఆయ‌న పాలించిన ఆయ‌న ఢిల్లీ తుగ్ల‌క్ ల దాడిలో ఓట‌మి పాల‌య్యారు. గ‌యాసొద్దీన్ తుగ్ల‌క్ కుమారుడైన ఉలుఘ్ ఖాన్ చేతిలో ఓట‌మి పాలైన ప్ర‌తిప‌రుద్రుడిని, ఆయ‌న త‌మ్ముడు అన్న‌మ‌దేవుడిని, మంత్రి గ‌న్న‌మ‌నాయ‌కుడిని బందీలుగా చేసుకుని ఉలుఘ్ ఖాన్ ఢ‌ల్లీ బ‌య‌లుదేరాడు.. ఓట‌మి అవ‌మాన భారాన్ని త‌ట్టుకోలేక ప్ర‌తాప‌రుద్రుడు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న యమునా న‌దిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న‌ది ఓ క‌థ‌నం.

వీరి వెంట వున్న ప్ర‌తాప‌రుద్రుడి త‌మ్ముడైన అన్న‌మ‌దేవుడు మార్గ‌మ‌ధ్యంలో త‌ప్పించుకుని దండ‌కార‌ణ్య ప్రాంతానికి పారిపోయాడ‌ట‌. అలా వెళ్లిన అన్న‌మ‌దేవుడు బ‌స్త‌ర్ లో రాజ్యాన్ని స్థాపించేందుకు స్థానిక గిరిజ‌నుల‌ను స‌మీక‌రించాడు. అన్న‌మ‌దేవుడు బ‌స్త‌ర్ లో సైన్యాన్ని స‌మీక‌రించుకుని ఒక‌దాని త‌రువాత ఒక రాజ్యాన్ని జ‌యిస్తూ వ‌చ్చాడు. ఆ త‌రువాత శంఖినిడంఖిని న‌ది ఒడ్డున దంతేశ్వ‌రీదేవి పేరుతో గొప్ప ఆల‌యాన్ని నిర్మించాడు. అప్ప‌టి నుంచి ఆ ప్రాంతాన్ని మ‌హిమాన్విత ప్రాంతంగా భావించ‌డం మొద‌లు పెట్టార‌ట‌.

ద‌క్ష‌య‌జ్ఞంలో పార్వ‌తీదేవి మ‌న‌స్తాపం చెంది మోగాగ్నిలో చ‌నిపోవ‌డం జ‌రిగింద‌ని చెప్పే పురాణ క‌థ ఇక్క‌డే జ‌రిగింద‌ని భావిస్తారు. పార్వ‌తి స‌తి నిర్వ‌హించిన స‌మ‌యంలో ఆమె ప‌న్ను ఇక్క‌డ ప‌డింద‌ని అందుకే ఈ దేవి దంతేశ్వ‌రి అని, ఈ ప్రాంతాన్ని దంతెవాడ అని పిలుస్తార‌ట‌. వ‌రంగ‌ల్ లో కాక‌తీయుల‌కు కాక‌తీదేవి ఎలా కుల‌దేవ‌తో బ‌స్త‌ర్ లోని అన్న‌మ‌దేవుని వంశ‌స్తులైన కాక‌తీయుల‌కు దంతేశ్వ‌రీదేవి ఆ విధంగా కుల‌దేవ‌త‌గా మారి పూజ‌లందుకుంద‌ని ప్ర‌తీతి. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంత‌మైన బ‌స్త‌ర్ ప్రాంతాన్ని దండ‌కార‌ణ్యంగా పిలుస్తారు. త్రేతాయుగంలో కోస‌ల రాజ్యంలో భాగంగా ఇది ఉండేది. క్రిస్టు పూర్తం 450 ప్రాంతంలో బ‌స్త‌ర్ రాజ్యాన్ని న‌ల‌వంశ‌రాజు భావ‌ద‌త్తుడు పాలించేవాడు. క్రిస్తు పూర్వం 440 - 460 మ‌ధ్య కాలంలో వాకాట‌క వంశ‌రాజైన న‌రేంద్ర సేనునిపై భావ‌ద‌త్తుడు దండెత్తినాడ‌ని చెప్పే చారిత్ర‌క ఆధారాలు ఉన్నాయి.

ఇక బ‌స్త‌ర్ లో కాక‌తీయ వంశ‌స్తుల పాల‌న విష‌యానికి వ‌స్తే.. 1223లో దండ‌కార‌ణ్యానికి వ‌చ్చి రాజ్యాన్ని స్థాపించుకున్న అన్న‌మ‌దేవుని త‌రువాత క్రీస్తు శ‌కం 1369 నుండి 1410 వ‌ర‌కు హ‌మీర‌దేవుడు క్రీ.శ‌. 1410 నుంచి 1468 వ‌ర‌కు బైటాయ్ దేవుడు, క్రీ.శ‌. 1468 నుంచి 1534 వ‌ర‌కు పురుషోత్త‌మ దేవుడు, క్రీ.శ‌. 1602 నుంచి 1625 వ‌ర‌కు ప్ర‌తార రాజాదేవ్ , క్రీ. శ‌. 1680 నుంచి 1709 వ‌ర‌కు దిక్పాల‌దేవ్, క్రీ.శ‌. 1709 నుంచి రాజ‌పాల‌దేవ్ పాలించార‌ట‌. రాజ‌పాల‌దేవ్ కు ఇద్ద‌రు భార్య‌లు. భాఘేలా వంశీనికి చెందిన మొద‌టి భార్య‌కు డ‌కిన్ సింగ్ అనే కుమారుడు, చందేలా వంశీనికి చెందిన రెండ‌వ భార్య‌కు ద‌ళ‌ప‌తిదేవ్, ప్ర‌తాప్ అనే ఇద్ద‌రు కుమారులు క‌లిగారు. క్రీ.శ‌. 1721లో రాజ‌పాల‌దేవ్ మ‌ర‌ణించాక పెద్ద భార్య త‌న సోద‌రుడిని రాజుగా ప్ర‌క‌టించింది.

అయితే ద‌ళ‌ప‌తిదేవ్ త‌ప్పించుకుని పొరుగు రాజ్య‌మైన జైపూర్ లో ప‌దేళ్లు ఉండి తిరిగి 1731లో సింహాస‌నాన్ని అదిష్టించాడు. మొద‌ట బ‌స్త‌ర్ లో వీరి రాజ‌సౌధం వుండేది. ఆ త‌రువాత వీరి రాజ‌ధాని జ‌గ‌ద‌ల్‌పూర్ కు మారింది. 15వ శాతాబ్దంలో కాంక‌ర్ కేంద్రంగా ఒక‌టి, జ‌గ‌ద‌ల్ పూర్ కేంద్రంగా మ‌రోక‌టి బ‌స్త‌ర్ రాజ్యం రెండు కేంద్రాల‌లో వుండేడిది. 18వ శ‌తాబ్దంలో మారాఠా సామ్రాజ్యం ప్రాబ‌ల్యంలోకి వ‌చ్చే వ‌ర‌కు వీరి రాజ్యం స్వ‌తంత్రంగానే వుండేది. 1861లో కొత్త‌గా ఏర్ప‌డిన బిరార్ సెంట్ర‌ల్ ప్రావిన్సులో భాగ‌మైంది. 1863లో 3 వేల పేష్క‌స్ చెల్లించే ఒప్పందంపై కోటపాడ్ ప్రాంతం జైపూర్ రాజ్యానికి ఇచ్చివేయ‌బ‌డింది. దీంతో క్ర‌మంగా బ‌స్త‌ర్ ప్రాబ‌ల్యం త‌గ్గిపోయింది.

1929 నుండి 1966 సంవ‌త్స‌రం వ‌ర‌కు పాలించిన ప్ర‌వీర్ చంద్ర భంజ్ దేవ్ అనంత‌రం బ‌స్త‌ర్ భార‌త్ యూనియ‌న్ లో విలీనమైంది. ప్ర‌వీర్ చంద్ర భంజ్ దేవ్ అంటే గిరిజ‌నులు ఎంతో అభిమానించేవారు. ప్ర‌వీర్ ను ఆదివాసీలు న‌డిచే దేవుడిగా భావించేవార‌ట‌. గిరుజ‌నుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించ‌డంతో 1966 మార్చి 25న పోలీసులు అత‌న్ని అత‌ని రాజ‌భ‌వ‌నంలోనే ఎన్ కౌంట‌ర్ పేరిట దారుణంగా కాల్చి చంపేశారు. అత‌నితో పాటు రాజ‌సేవ‌కులు, గిరిజ‌నులు అనేక మంది హ‌త్య చేయ‌బ‌డ్డారు. రాజుతో స‌హా 11 మంది మ‌ర‌ణించ‌డా, 20 మంది గాయ‌ప‌డ్డార‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. 61 రౌండ్ల కాల్పులు జ‌రిపారు. ప్ర‌వీర్ చంద్ర‌ మ‌ర‌ణించ‌గా త‌రువాత విజ‌య‌చంద్ర భంజ్ దేవ్ 1970 వ‌ర‌కు, భ‌ర‌త్ చంద్ర భంజ్‌దేవ్ 1996 వ‌ర‌కు రాజులుగా ఉండ‌గా, ప్ర‌స్తుత క‌మ‌ల్ చంద్ర భంజ్ దేవ్ 1996 ఏప్రిల్ నుంచి రాజుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బ‌స్త‌ర్ పాల‌కుల‌లో ప్ర‌ఫుల్ల కుమార్ దేవ్ త‌రువాత వ‌చ్చిన పాకుకుల‌కు భంజ్ దేవ్ అనేది వ‌చ్చింది. 1891 నుంచి 1921 వ‌ర‌కు పాలించిన ప్ర‌తాప రుద్ర‌దేవ్ కు మ‌గ సంతానం లేదు. త‌న కుమార్తె ప్ర‌ఫుల్ల కుమార‌దేవిని ఒరిస్సాలోని మ‌యూర్ భంజ్ రాజైన ప్ర‌ఫుల్ చంద్ర భంజ్ కు ఇచ్చి వివాహం చేశారు. అప్ప‌టి నుంచి ఇక్క‌డి రాజుల‌కు భంజ్ అనేది మొద‌లైంది. ఇప్ప‌టికీ ఈ ప్రాంతంలో జ‌రిగే ద‌స‌రా ఉత్స‌వాలు కాక‌తీయుల క‌నుస‌న్న‌ల‌లోనే జ‌రుగుతాయి. ఈ ప్రాంతంలోని అనేక మంది గిరిజ‌నులు కాక‌తీయుల వంశ‌స్తుల‌కు ప్ర‌త్యేక గౌర‌వం ఇస్తారు. దంతేశ్వ‌రీదేవితో పాటు ఆమె సోద‌రి మ‌వోళి దేవ‌త‌ను కూడా ఆరాధిస్తారు. ద‌స‌రా స‌మ‌యంలో రావ‌ణ వేడుక‌ల‌ను అత్యంత వైభ‌వంగా రాజ‌రిక‌పు సాంప్ర‌దాయంలో జ‌రుపుతారు.

మ‌న ద‌గ్గ‌ర దేవుడు అనే వాచ‌కం అక్క‌డికి వెళ్లాక దేవ్ గా మారింది. దంతేవాడ‌లో ఇప్ప‌టికీ రాజ‌ఠీవితో ఉట్టిప‌డే రాజ‌సౌధం వుంది. ఈ రాజ‌సౌధంలో క‌మ‌ల్ చంద్ర భంజ్ దేవ్, రాజ‌మాత కృష్ణ‌కుమారీ దేవి, గాయ‌త్రి దేవిలు నివాసం వుంటున్నారు. కాక‌తీయుల వార‌సుడిగా ఉన్న క‌మ‌ల్ చంద్ర భంజ్ దేవ్ 1984లో జ‌న్మించారు. బ్రిట‌న్ లో కాన్వెంట‌రీ యూనివ‌ర్సిటీలో ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్ లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసి అనంత‌రం పొలిటిక‌ల్ సైన్సులో పీజీ చేశారు. ప్ర‌స్తుంతం ప్ర‌వీర్ సేన అనే స్వ‌చ్ఛంద సంస్థ ద్వారా ప్ర‌జాసేవ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. బ‌స్త‌ర్ కేంద్రంగా ఉన్న స‌ర్వ్ స‌మాజ్ కు అధ్య‌క్షుడిగా ఉన్నారు. యువ‌కుడిగా, ఆధునిక భావాలున్న కాక‌తీయుల వార‌సుడిగా క‌మ‌ల్ చంద్ర భంజ్ దేవ్ వ‌రంగ‌ల్, హైద‌రాబాద్ ల‌లో ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నందున ప్ర‌జ‌లు పెద్ద‌సంఖ్య‌లో స్వాగ‌తం ప‌లికేందుకు సిద్దం అవుతుండ‌టం విశేషం.