Begin typing your search above and press return to search.

మహానాడు.. కీలక నేతల మిస్సింగ్‌!

By:  Tupaki Desk   |   30 May 2023 11:54 AM GMT
మహానాడు.. కీలక నేతల మిస్సింగ్‌!
X
దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శత జయంతి ని పురస్కరించుకుని టీడీపీ రెండు రోజుల పాటు మహానాడు ను నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజమండ్రి లో మే 27, 28 తేదీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ను పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు సమర శంఖం పూరించారు. పలు కీలక పథకాలను ప్రకటించారు. తాము అధికారం లోకి వస్తే వాటిని అమలు చేస్తామని వెల్లడించారు.

ఈ మహానాడు కు లక్షల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పొలిట్‌ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీలు, దిగువ శ్రేణి నేతలు ఇలా భారీగా తరలిరావడంతో మహానాడు ప్రాంగణం అంతా పసుపుమయంగా మారింది.

అధికారం లోకి వస్తే మహిళల కు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, నిరుద్యోగుల కు నెలకు మూడు వేల రూపాయల భృతి, రైతులకు ఏటా రూ.20 వేలు, బిడ్డలు ఉన్న తల్లులకు రూ.15 వేలు ఇలా పలు పథకాల ను చంద్రబాబు ప్రకటించారు. దీంతో టీడీపీ లో రెట్టింపు జోష్‌ నెలకొంది.

అయితే మరో వైపు కీలక నేతలు మహానాడుకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఆయన తనయుడు రాయపాటి రంగారావు, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ్‌ కృష్ణ రంగారావు, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి, కర్నూలు మాజీ ఎంపీ కోట్ల విజయభాస్కర రెడ్డి ఇలా పలువురు కీలక నేతలు మహానాడు కు హాజరు కాకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారిందంటున్నారు.

అలాగే టీడీపీ కి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో నలుగురు.. వల్లభనేని వంశీమోహన్, మద్దాళి గిరిధర్, కరణం బలరామ్, వాసుపల్లి గణేష్‌ కుమార్‌ వైసీపీ తో అంటకాగుతున్నారు. ఇక టీడీపీ కి మిగిలింది 19 మంది ఎమ్మెల్యేలు. అయితే వీరిలో 15 మంది వరకు గైర్హాజరయ్యారని చెబుతున్నారు.

ముఖ్యంగా మహిళా నేతలు పెద్దగా హాజరు కాకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీ లోకి ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలు.. గిడ్డి ఈశ్వరి (పాడేరు), వంతల రాజేశ్వరి (రంపచోడవరం) వంటివారు సైతం మహానాడు కు హాజరు కాలేదని టాక్‌.

ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం మాత్రమే ఉంది. ముందస్తు ఎన్నికలు కూడా వస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు కు కీలక నేతలు డుమ్మా కొట్టడం హాట్‌ టాపిక్‌ గా మారింది.