Begin typing your search above and press return to search.

పార్లమెంట్ సాక్షిగా మహిళపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్..!

By:  Tupaki Desk   |   5 Dec 2022 3:30 PM GMT
పార్లమెంట్ సాక్షిగా మహిళపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్..!
X
రాచరికం కాలం నుంచి మనిషి ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టి చాలా కాలమే అయింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ.. ప్రాథమిక హక్కులు తదితర హక్కులన్నీ సమానంగా ఉంటాయి. చట్టం ముందు అంతా సమానమే భావన ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో రాజకీయాలు చాలా దిగజారిపోతున్నాయి.

నేర చరిత్ర కలిగిన వాళ్లు.. అవినీతి పరులు.. ఆవేశపూరిత వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తుండటంతో పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం వ్యవస్థ ఖూనీ అవుతోంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు పార్లమెంట్.. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలపై చర్చించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల పార్లమెంట్.. అసెంబ్లీలలో ప్రజా సమస్యలపై చర్చ కన్నా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత లభిస్తుంది.

మన పార్లమెంట్.. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. ప్రతిపక్ష.. అధికార పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. గతంలో ఓ ఎంపీ పార్లమెంట్ లో అశ్లీల వీడియో చూస్తూ కెమెరా చిక్కడం పెద్ద దుమారాన్నే లేపింది.

అలాగే ఎంపీల కొనుగోళ్లు చేపడుతూ అడ్డంగా డబ్బు కట్టలతో దొరికిపోయిన నేతలు కూడా ఉన్నారు. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రతులను చింపడం.. స్పీకర్ పై పేపర్లు విసరడం లాంటివి ఇటీవలి కాలంలో కామన్ అయిపోయాయి. చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉన్నా అది నామమాత్రమే. కొందరు నేతలు మహిళలని కూడా వ్యక్తిగత దాడులకు సైతం పాల్పడుతుండటం శోచనీయంగా మారుతోంది.

తాజాగా ఆఫ్రికా దేశంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ అధికార పక్షంలోని మహిళా ఎంపీపై చేయి చేసుకున్నాడు. ఇష్టారీతిన ఆమెపై దాడికి తెగబడగా పక్కనే ఉన్నవారు ఆపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే..!

ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార కూటమికి చెందిన బెన్నో బాక్ యాకర్(బీబీవై)కి చెందిన మహిళా ఎంపీ డైయే గ్నిబీ మాట్లాడుతున్న సమయంలోనే  ప్రతిపక్ష ఎంపీ మస్సాటా సాంబ్ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ అనూహ్య సంఘటనతో పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇరుపక్షాల ఎంపీలు కూర్చీలు.. పేపర్లు విసురుకున్నారు. ఇకపై దాడి చేసిన సాంబ్ పై కూర్చి విసిరేసే క్రమంలో గ్నిబీ కింద పడిపోయారు. ఈక్రమంలోనే ఇరువురి ఎంపీలను కొంతమంది ఎంపీలు ఆపే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ లో మాటల యుద్ధం ఓ రేంజులో పెరగడంతో సమావేశాలను స్పీకర్ వాయిదా వేశారు.

ఈ ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో అధికార కూటమికి మెజార్టీ రాకపోవడంతో ఇరుపార్టీల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి నుంచి అధికార.. ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సహనం కోల్పోయిన ప్రతిపక్ష ఎంపీ అధికార పార్టీకి చెందిన మహిళ ఎంపీపై చేయిచేసుకోగా వైరల్ గా మారింది. ఒక విధంగా వీళ్లతో పోల్చుకుంటే మన ఎంపీలే ఒకింత నయం అనిపిస్తుంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద తెలియజేయండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.