Begin typing your search above and press return to search.

పవన్‌ చెప్పిన ఆ ఆప్షన్‌ కే కట్టుబడి ఉన్నాం: ఎంపీ జీవీఎల్‌ హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!

By:  Tupaki Desk   |   28 Jan 2023 10:00 PM GMT
పవన్‌ చెప్పిన ఆ ఆప్షన్‌ కే కట్టుబడి ఉన్నాం: ఎంపీ జీవీఎల్‌ హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!
X
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. పవన్‌ చెప్పిన ఆ ఆప్షన్‌ కే తాము కట్టుబడి ఉన్నామన్నారు. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో కలవబోమని వెల్లడించారు. వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని తెలిపారు. జనసేనతో తాము కలిసే ఉన్నామని.. కలిసే ఉన్నామని చెప్పడానికి రోజూ ఫొటోలు దిగాలా అని జీవీఎల్‌ ప్రశ్నించారు.

ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించి తప్పు చేశారని జీవీఎల్‌ తెలిపారు. ఆ తప్పుడు నిర్ణయం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలను ఓడించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుందని తెలిపారు.

కొంతమంది జనసేన–బీజేపీ పొత్తుపై అనుమాన బీజాలు నాటుతున్నారని మండిపడ్డారు. తమకు లేని అనుమానాలు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. తాము చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా మంచి స్పష్టతతో ఉన్నామని వెల్లడించారు.

బీజేపీతో కలిసే ఉన్నామని, కలిసే వెళ్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారని జీవీఎల్‌ గుర్తుచేశారు. తాము ఆంధ్రప్రదేశ్‌ లో బెస్ట్‌ పార్టీ అని తెలిపారు. తాము రెండో ఆప్షన్‌ కాబోమని వెల్లడించారు. తాము మొదట అనుకున్నదే చేస్తామని.. అదే సాధ్యమయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. తాము కామన్‌ లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రతి రోజు సమావేశం కావాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే ఐదు నిమిషాల్లో జనసేన నేతలతో కలుస్తామని చెప్పారు.

బీజేపీ, జనసేన కలిసే ముందుకు వెళ్తాయని జీవీఎల్‌ స్పష్టం చేశారు. తాము ఏం చేయాలనేది అధినాయకత్వం నిర్ణయిస్తుందని జీవీఎల్‌ వివరించారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

రాష్ట్రంలో హిందూ వ్యతిరేక చర్యలు ఎక్కువ అయ్యాయమని మండిపడ్డారు. టీటీడీ విషయంలో భగవంతుడిని భక్తులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. టీటీడీలో జరుగుతున్న కుట్రల వెనక అదృశ్య శక్తులు ఉన్నాయని ఆరోపించారు. విశాఖ–అరకు రోడ్డు విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రితో త్వరలోనే మాట్లాడతానని వివరించారు. కొన్ని వర్గాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. వైజాగ్‌ ఇన్ఫోకస్‌ అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో మాట్లాడతానని పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.