గుండెకాయ లాంటి చోట అండ లేరా... ?

Tue Jan 18 2022 06:00:01 GMT+0530 (IST)

MP Candidate of Vijayawada For YSRCP

ఆనాడూ ఈనాడూ కూడా ఏపీకి రాజకీయ రాజధాని అంటే బెజవాడనే చెప్పుకుంటారు. అక్కడ జెండా ఎగిరితేనే ఎంత గొప్ప పార్టీకైనా గొప్ప. అలాంటి చోట క్రిష్ణా జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు మచిలీ పట్నం ఎంపీ సీటు కూడా గెలుచుకుంది. కానీ విజయవాడలో మాత్రం వైసీపీకి ఒక విధంగా కొరుకుడుపడడం లేదు. గన్నవరం ఎమ్మెల్యే టీడీపీ గెలుచుకుంది. ఇక విజయవాడ సెంట్రల్ లో చూసే కేవలం పాతిక ఓట్లతో మల్లాది విష్ణు గెలిచారు విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహనరావు టీడీపీ తరఫున గెలిచారు. ఈ విధంగా చూస్తే వైసీపీకి బెజవాడ బెదరగొట్టేలాగే ఉంది.వీటన్నిటి కంటే కూడా విజయవాడ ఎంపీ సీట్లో ఓటమి కూడా ఫ్యాన్ పార్టీకి ఉక్కబోతలా ఉంది. ఈ వరసబెట్టి రెండు ఎన్నికల్లో చూసుకుంటే విజయవాడలో జెండా ఎగరేయలేకపోతోంది. 2014లో విజయవాడ నుంచి కోనేరు రాజేంద్ర ప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేస్తే కేశినేని నాని ఓడించారు. ఇక 2019 నాటికి పొట్నూరు వరప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

దీంతో అక్కడ ఎంపీ క్యాండిడేట్ అంటే ఎవరూ లేరు అనుకుంటున్నారు.  పార్లమెంట్ పరిధిలో అయిదు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినా పార్లమెంట్ సీటులో పరాయజం తప్పలేదు. ఇక 2024 నాటికి చూస్తే వైసీపీకి వ్యతిరేకత సహజంగా ఉంటుంది. దాంతో ఈసారి ఎంపీ సీటు లో గెలుపు సాధ్యమేనా అన్న చర్చ అప్పుడే మొదలైంది.

ఇదిలా ఉంటే ఓడిన పొట్నూరి వర ప్రసాద్ పూర్తిగా పార్టీ యాక్టివిటీస్ లో లేకుండా పోయారు. ఆయన మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే అంటున్నారు. దాంతో వైసీపీకి అభ్యర్ధి కొరత అయితే గట్టిగా ఉంది అంటున్నారు. ఈసారి కులం కార్డుతోనే నెట్టుకురావాలని వైసీపీ ఆలోచిస్తోందిట. అదెలా అంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎద్ద ఎత్తున బీసీలు ఉన్నారు. దాంతో వారి నుంచి ఒకరికి టికెట్ ఇచ్చి కమ్మ సామాజికవర్గం చేతిలో ఉన్న విజయవాడ ఎంపీ కోటను బద్ధలు కొట్టాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది అంటున్నారు.

ఇప్పటికే విజయవాడ ప్రధమ పౌరురాలిగా బీసీ వర్గానికి చెందిన మనిషిని ఎంపిక చేసి అందరి ఊహలను తారు మారు చేసిన వైసీపీ అదే ఎత్తుగడతో 2024 ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోందిట. అంటే కమ్మ వర్సెస్ బీసీ వార్ గా విజయవాడను 2024లో మార్చబోతున్నారు అని తెలుస్తోంది. మరి ఈ బీసీ కార్డు వైసీపీకి బెజవాడ ఎంపీని అందిస్తుందా అంటే వేచి చూడాల్సిందే.