పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎంపీ భరత్ కౌంటర్

Thu Sep 23 2021 17:00:01 GMT+0530 (IST)

MP Bharat counter on Pawan Kalyan comments

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా ఏకంగా రాజమండ్రి ఎంపీ దత్తత తీసుకున్న గ్రామంలో జనసేన జెండా ఎగురవేసింది. ఇటీవల పరిషత్ ఎన్నికల ఫలితాల్లో జనసేన తూర్పు గోదావరి జిల్లాలో మంచి ఫలితాలు సాధించింది. రాజమండ్రి ఎంపీ భరత్ దత్తత గ్రామంలోనూ సత్తాచాటింది. అక్కడ విజయంపై తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. దీనికి ఇవాళ రాజమండ్రి ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు.‘నా దత్తత గ్రామం పొట్టిలంకలో ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికావు.. దత్తత తీసుకుంటే ఖచ్చితంగా గెలవాలని ఎలా చెప్పగలం’ అని ఎంపీ భరత్ ప్రశ్నించారు. జనసేన ప్రభావం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మరి ఆ గ్రామ సర్పంచ్ మా పార్టీ బలపరిచిన అభ్యర్థినే గెలిచాడని చెప్పుకొచ్చాడు. దీనిపై పవన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

ఇక సొంత పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో వివాదంపై ఎంపీ భరత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ‘నో కాంట్రవర్సీ’ అంటూ జక్కంపూడి రాజా వర్గం రైతుల ఆరోపణలను కొట్టిపారేశారు. పరుషోత్తపట్నం రైతులు నన్ను ఒక్కసారే కలిశారని తెలిపారు.

మొత్తంగా మొదటిసారే గెలిచిన యువ ఎంపీ భరత్ తన దూకుడుతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు తెచ్చుకుంటున్నారు. ఇక అధికారంలో ఉండి దత్తత గ్రామంలో గెలిపించుకోలేదని.. సరైన అభివృద్ధి చేయడం లేదన్న అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. తాజాగా పవన్ సైతం ఈ మాట అనడంతో ఇరుకునపడ్డాడు. ఇప్పటికైనా ఈ వివాదాలకు దూరంగా ఉండాలని ఎంపీ భరత్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంవమైంది.