Begin typing your search above and press return to search.

11 గంటలు 14 ప్రశ్నలు.. ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ..

By:  Tupaki Desk   |   21 March 2023 1:04 PM GMT
11 గంటలు 14 ప్రశ్నలు.. ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ..
X
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిన్న ఈడీ అధికారులు ఏకంగా 11 గంటల పాటు కవితను విచారించారు. ఈ క్రమంలోనే 14 ప్రశ్నలు అడిగినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలంటూ కవిత చేసిన విజ్ఞప్తి మేరకు అధికారులు విచారణను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేసినట్టుగా మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కవిత పలు ప్రశ్నలను ఈడీ అధికారులకు ఎదురు ప్రశ్నించారని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఇది కేవలం రాజకీయ కుట్ర అని స్పష్టం చేసినట్టు తెలిసింది. రాజకీయ ఒత్తిడితోనే ఈడీ ప్రశ్నలలో పారదర్శకత లోపించిందని కవిత నేరుగా కౌంటర్ అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఆ 14 ప్రశ్నలు ఏంటి? కవిత ఏమని సమాధానాలు ఇచ్చారన్నది ఇప్పుడు మీడియాలో.. సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా కవిత కొన్ని ప్రశ్నలను ఈడీ అధికారులకు నేరుగా సంధించారు. 'ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో నన్ను నిందితురాలిగా పిలిచారా?' అని ఈడీ అధికారులను ప్రశ్నించగా.. దానికి 'కాదు' అని అధికారులు సమాధానమిచ్చినట్టు తెలిసింది.

ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా మద్యం విధానాన్ని మార్చుకుంటే దాంతో తనకేంటి సంబంధం అని ఈడీని కవిత ప్రశ్నిస్తోంది. రాజకీయ కక్షతో మీరు ఇలా ఎంతమందిని విచారణకు పిలుస్తారని గట్టిగా కవిత నిలదీసినట్టుగా చెబుతున్నారు. ఇక బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మ, నారాయణ రాణే, సుజనా చౌదరిలపై గతంలో మీరు పెట్టిన కేసులు ఏమయ్యాయి? బీజేపీలో చేరగానే వారిపై విచారణ ఎందుకు ఆగింది? అని ఈడీని కవిత నిలదీసిందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

విచారణ పేరుతో పిలిచి గంటలకొద్దీ గదిలో ఒంటరిగా కూర్చోబెట్టి మానసికంగా వేధిస్తే లొంగిపోతామనుకుంటున్నారా? అని కవిత అడిగినట్టుగా చెబుతున్నారు. దీనికి ఈడీ అసలు సమాధానం ఇవ్వలేదని.. ఈడీ అధికారులను కవిత ప్రశ్నలతో భయపెట్టిందని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.

-ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖలో ఏముందంటే?

ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కవిత సంచలన లేఖ రాశారు. 'దురుద్దేశంతోనే వ్యవహరిస్తున్నప్పటికీ నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను. ఒక మహిళ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలిగించదా? నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణకు ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబర్ లోనే ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే.

లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం' అని లేఖలో కవిత పేర్కొన్నారు.

ఈడీ చేస్తున్న తప్పుడు ఆరోపణలకు సమాధానంగా నేను వాడిన ఫోన్లను అందజేస్తున్నాను. ఒక మహిళగా తన ప్రైవసీని కూడా కాదని ఫోన్లు అందజేస్తున్నాను' అంటూ కవిత తాజాగా ఈడీ డైరెక్టరేట్ కు నేరుగా లేఖ రాశారు. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు తన 10 ఫోన్లను తీసుకొచ్చిన కవిత ఆ ఫోన్లను ఈడీ అధికారులకు అందజేయనున్నట్టుగా వాటిని మీడియాకు చూపించారు. విజయ సంకేతం చూపిస్తూ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. తన లాయర్ తో కలిసి ఈడీ కార్యాలయానికి బయలు దేరారు.

ఈడీ ముందు విచారణకు హాజరైన కవిత వెంట ఆమె భర్త అనిల్ ఉన్నారు. ఈరోజు విచారణలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.